Begin typing your search above and press return to search.

ఏపీతోనే కాదు.. దేవుడితోనైనా కొట్లాడుతాం: కేటీఆర్

By:  Tupaki Desk   |   10 July 2021 6:00 PM IST
ఏపీతోనే కాదు.. దేవుడితోనైనా కొట్లాడుతాం: కేటీఆర్
X
కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో తెలంగాణ వైఖరి మరోసారి స్పష్టమైంది. నీటి కోసం ఎలాంటి ఫైట్ కైనా సిద్ధమని తేల్చి చెప్పారు. తాజాగా మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. కృష్ణా జలాల విషయంలో వెనక్కి తగ్గేదే లే అని స్పష్టం చేశారు. కేసీఆర్ ఉండగా అన్యాయం జరగదన్నారు. కృష్ణా జలాల కోసం ఏపీతోనే కాదు దేవుడితో అయినా కొట్లాడుతాం అని స్పష్టం చేశారు. చట్టప్రకారం రావాల్సిన నీటి వాటాను సాధించుకుంటామన్నారు.

కృష్ణా జలాల విషయంలో ఏపీ, తెలంగాణ మంత్రులు, నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కొద్దిరోజులుగా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఇక ఈ వివాదం అటు తెలంగాణ, ఇటు వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

కేసీఆర్ నాయకత్వంలో ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడుతామని.. ఎవరెన్ని రకాలుగా అడ్డుకున్నా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేస్తామని ప్రకటించారు.

నారాయణ పేటలో పర్యటించిన కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు పక్కనే 10కి.మీల దూరంలో ఉన్న బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రంలో అమలు అవుతున్నాయా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మీ పథకాలు పక్కనే ఉన్న కర్ణాటకలో అమలు అవుతున్నాయా? నారాయణ పేట ప్రజలు ఆలోచించుకోవాలని కేటీఆర్ కోరారు. దేశంలోనే అత్యధిక పంట పండిస్తూ తెలంగాణ ధాన్యాగారంగా మారిందన్నారు.

పాలమూరులోని ప్రతి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని.. సీఎం కేసీఆర్ ఉండగా పాలమూరు జిల్లాకు అన్యాయం జరగనివ్వమని కేటీఆర్ స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పుతాం అని కేటీఆర్ అన్నారు.