Begin typing your search above and press return to search.

మహిళతో దారుణంగా.. తాగిన మత్తులో రెచ్చిపోయిన ఏఎస్పీ

By:  Tupaki Desk   |   16 Sept 2022 10:05 PM IST
మహిళతో దారుణంగా.. తాగిన మత్తులో రెచ్చిపోయిన ఏఎస్పీ
X
మద్యం మత్తులో కన్నుమిన్ను కానకుండా ప్రవర్తించాడు ఆ ఏఎస్పీ. యువతిని అని కూడా చూడకుండా ఆమెను తాకరాని చోట తాకి.. అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రశ్నించిన మహిళలు, పాత్రికేయులపై దాడికి దిగాడు. అడ్డుచెప్పిన సిబ్బందిపైనా దూషణలకు దిగాడు. అనంతరం ఇది వివాదం కావడంతో తనకు ఆరోగ్యం బాగాలేదని ఆస్పత్రిలో చేరి మొసలి కన్నీరు కారుస్తున్నాడు.

ఒడిషాలోని నవరంగపూర్ జిల్లాలో బుధవారం జరిగిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. బరగఢ్ జిల్లాకు చెందిన ఓ యువతి ప్రేమించిన వ్యక్తితో కలిసి పపడాహండిలో రహస్యంగా జీవిస్తోంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడి ఏఎస్పీ జయకృష్ణను కలిశారు. యువతి ఉన్న ప్రాంతాన్ని కనుగొని ఆమెను బలవంతంగా ఆ ఏఎస్పీ వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించాడు. ఆమె పెద్ద ఎత్తున అరిచినా.. ఏడ్చినా వినకుండా ఆమె చాతి, ఇతర భాగాల్లో తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు.

విలేకరులు, మిగతా పోలీసులు వారించినా.. అలా తాకవద్దన్న కూడా ఏఏస్సీ ఆగ్రహంతో వారిపై దాడికి దిగారు. లాఠీలతో పాత్రికేయులపై దాడి చేశాడు. అడ్డుకున్న మహిళలను చితకబాదాడు. వారించిన పోలీసులను తిట్టిపోశాడు. ఏఎస్పీ ఫుల్లుగా తాగి ఉన్నట్టు మద్యం వాసన రావడంతో ఎవరూ దగ్గరకు వెళ్లలేకపోయారు.

అనంతరం యువతిని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు. పాత్రికేయులు పోలీస్ స్టేషన్ చేరుకొని ఆందోళన చేశారు. కలెక్టర్ భాస్కర్ ఘటనా స్థలానికి చేరుకొని పాత్రికేయులతో చర్చలు జరిపి శాంతింపచేశారు.

యువతి శరీర భాగాలను తాకుతూ ఏఎస్సీ జయకృష్ణ వీరంగం సృష్టించిన ఫొటోలు అప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ దీన్ని పెద్ద ఉద్యమంగా మలిచింది. కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు, కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు ఏఎస్సీ అరెస్ట్ చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.

దీంతో ఏఎస్సీ వెంటనే సర్దుకున్నారు. అనారోగ్యం కారణం చూపుతూ కేంద్ర ఆస్పత్రిలో చేరారు. బాధిత మహిళ జాడ తెలుసుకొని ఆమెను సంరక్షణ కేంద్రానికి తరలించారు. దీనిపై మరో ఎస్పీతో విచారణకు ఆదేశించారు. దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకోనున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.