Begin typing your search above and press return to search.

పెద్దిరెడ్డి.. ఈ రోడ్డు లొల్లి ఏమిటి?

By:  Tupaki Desk   |   1 Oct 2020 7:50 AM GMT
పెద్దిరెడ్డి.. ఈ రోడ్డు లొల్లి ఏమిటి?
X
ఏపీ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. అధికారుల అత్యుత్సాహం.. మంత్రిగారి దగ్గర మార్కులు కొట్టేయాలన్న ఆలోచన ఏపీ సర్కారుకు చిరాకుగా మార్చటమే కాదు.. ఇలాంటి వివాదాల్ని కదిలించుకొని మీదేసుకోవాల్సిన అవసరం ఉందా? అన్న మాట వినిపిస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి మెప్పు కోసం సీసీ రోడ్డును నిర్మించిన వైనాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

మంత్రిగారి ఇంటి గుమ్మం దగ్గర మొదలయ్యే ఈ సీసీ రోడ్డు నిర్మాణం.. మంత్రి గారి ఇంటి పెరటి వరకు ఉండటం ఏమిటని నిలదీస్తున్నారు. తిరుపతి పట్టణంలోని మారుతీనగర్ లో మంత్రి పెద్దిరెడ్డి వారికి లంకంత ఇల్లు ఉంది. దానికి పశ్చిమాన ప్రవేశద్వారం ఉంది. అయితే.. ఇంటి వెనుక భాగం తూర్పున రోడ్డును తాకుతుంది. ఆ రహదారిని వాడితే.. మంత్రిగారు.. ఆయన కుటుంబ సభ్యులు నేరుగా ఎయిర్ పోర్టుకు వెళ్లటానికి అనువుగా ఉంటుంది.

ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండే ఈ రహదారికి అవసరమైన సీసీ రోడ్డును తాజాగా నిర్మించటం వివాదంగా మారింది. ఇంటి గుమ్మం నుంచి పెరటి గేటు వరకు ప్రత్యేకంగా సీసీ రోడ్డు వేయించుకున్న ఏపీ మంత్రిగారి ఆలోచనను పలువురు తప్పు పడుతున్నారు. అదే సమయంలో మంత్రిగారి మెప్పు కోసం అధికారులు వ్యవహరించిన తీరు సరికాదంటున్నారు.

దాదాపు 300 మీటర్ల పొడవు ఉన్న ఈ రోడ్డు కోసం ప్రభుత్వ సొమ్ము రూ.20లక్షలు ఖర్చు చేయటాన్ని తప్పుపడుతున్నారు. ఈ చిన్న వ్యవహారానికి అధికారుల్ని ఇన్ వాల్వ్ చేయాల్సిన అవసరం ఏముందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. చిన్న విషయాల్లో కక్కుర్తి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుందన్న విషయాన్ని మంత్రివర్యులు ఇప్పటికే గ్రహించారా?