Begin typing your search above and press return to search.

గోదావరిపై కుండ బద్ధలు కొట్టిన జగన్ సర్కారు

By:  Tupaki Desk   |   25 Aug 2020 7:00 AM GMT
గోదావరిపై కుండ బద్ధలు కొట్టిన జగన్ సర్కారు
X
సాగు..తాగు నీటి అవసరాలకు సంబంధించి ఎవరైనా సరే.. ఏపీ ప్రయోజనాల తర్వాతే ఎవరైనా అన్న విషయంలో జగన్ సర్కారు మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. ఎవరెన్ని ఒత్తిల్లు తీసుకొచ్చినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా గోదావరి జలాల్ని కావేరీతో అనుసంధానం చేసే అంశంపై తన వాదనను సూటిగా చెప్పేసింది. తాజాగా కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ అధ్యక్షతన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ తన వాదనను బలంగా వినిపించింది.

బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం గోదావరి మిగులు జలాలపై సంపూర్ణ హక్కు కింది రాష్ట్రమైన ఏపీదేనని స్పష్టం చేసింది. గోదావరిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చూసినప్పుడు మిగులు జలాలే ఉండవని పేర్కొంది. అలాంటప్పుడు ఏ నీటిని కావేరికి తరలిస్తారని ప్రశ్నించింది. తాము ప్రస్తావించిన అంశాలకు వివరణ ఇస్తే.. గోదావరి - కావేరి అనుసంధానపై తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని చెప్పింది. గోదావరి నీటి వినియోగానికి సంబంధించి కేంద్రం చేసిన ప్రతిపాదనల్ని చూస్తే..

1, ఇచ్చంపల్లి.. అకినేపల్లిల నుంచి ఎత్తిపోసే గోదావరి జిలాల్లో ఏపీకి 81.. తెలంగాణకు 66.. తమిళనాడుకు 83 టీఎంసీలు ఇవ్వటం
2. జానంపేట నుంచి ఎత్తిపోసే గోదావరి జలాల్లో ఏపీకి 108.. తెలంగాణకు 39.. తమిళనాడుకు 83 టీఎంసీలు ఇవ్వటం..
గోదావరి జలాల్లో తెలంగాణకు 954.23 టీఎంసీల వాటా ఉందని.. వాటిని మినహాయించుకొని మిగులు జలాల్ని ఇతర ప్రాంతాలకు తరలించాలని తెలంగాణ తన వాదనను వినిపించటంపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేయటం గమనార్హం. గోదావరి.. కృష్ణా ట్రిబ్యునల్ అవార్డులపై తనకు సమగ్ర అవగాహన ఉందని.. ఆ స్థాయిలో తెలంగాణకు కేటాయింపులు లేవని స్పష్టం చేసింది.
గోదావరి -కావేరీ అనుసంధానంపై ఏపీ ప్రభుత్వం అడిగిన వివరణలు తెలియజేస్తామని చెప్పింది. మొత్తంగా చూస్తే.. కేంద్రం తీసుకునే నిర్ణయాలకు తలూపటం కాకుండా.. ఏపీ ప్రయోజనాలు తమకు చాలా అవసరమన్న విషయమన్ని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసిందని చెప్పక తప్పదు.