Begin typing your search above and press return to search.

ఏపీ సర్కారు ప్రకటనల్లో మార్పొచ్చిందే !

By:  Tupaki Desk   |   6 Sep 2020 6:00 AM GMT
ఏపీ సర్కారు ప్రకటనల్లో మార్పొచ్చిందే !
X
ప్రభుత్వ పథకాల్లో ముఖ్యమంత్రితో పాటు మంత్రుల ఫోటోలు వేసుకుంటూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారనే ఓ కేసు కోర్టు విచారణలో ఉంది. పైగా జారీ చేస్తున్న ప్రకటనల్లో అచ్చంగా అధికార వైసిపి రంగులతోనే అడ్వర్టైజ్ మెంట్లను డిజైన్ చేస్తున్నారనే ఆరోపణలను కూడా కోర్టు విచారిస్తోంది. ఇటువంటి నేపధ్యంలో వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్-మీటర్ల బిగుంపుపై ప్రభుత్వం వరుసగా రెండో రోజు కూడా అడ్వర్టైజ్ మెంటు జారీ చేసింది. ఆ ప్రకటనల్లో ఎక్కడా పార్టీ రంగు కనబడలేదు. మామూలుగా అయితే ముఖ్యమంత్రి ఫొటోతో పాటు సంబంధిత శాఖ మంత్రి ఫొటో కూడా ఉండటం సహజమే. అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎం, మంత్రి ఫొటోతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఫొటోను కూడా కలిపారు.

గడచిన ఏడాదిన్నరగా ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలపై విజయవాడకు చెందిన ఓ న్యాయవాది కోర్టులో పిటీషన్ వేశాడు. వైఎస్సార్ ఫొటో ముద్రించటంతో పాటు పార్టీ రంగులు అద్దటాన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాడు. వైఎస్సార్ ఫొటో వేయటంలో అభ్యంతరం ఏమిటి ? వైఎస్ కూడా సిఎంగా చేశాడు కదా అని కోర్టు వేసిన ప్రశ్నకు పిటీషనర్ సమాధానం చెప్పలేకపోయాడు. సరే కేసు విచారణలో ఉన్నది కాబట్టి ప్రభుత్వ ఆలోచనలో మార్పొ వచ్చిందేమో. అందుకనే తాజగా జారీ చేసిన ప్రకటనల్లో ఎక్కడా వైఎస్సార్ ఫొటోను కానీ - పార్టీ రంగులు కానీ - విద్యుత్ శాఖ మంత్రి ఫొటో కూడా కనబడలేదు.

మొత్తం మీద ఇపుడు జారీ చేసిన ప్రకటనలను చూసిన తర్వాత కోర్టు మొట్టికాయలు ప్రభుత్వం పై బాగానే పనిచేసినట్లు అర్ధమవుతోంది. తాను చేసింది తప్పు కాదని అనుకుంటే వైఎస్సార్ ఫొటోతో పాటు విద్యుత్ శాఖ మంత్రి ఫొటో- పార్టీ రంగులతో డిజైన్ ఎందుకు కనబడలేదు ? ముందు తాను అనుకున్నట్లే చేసుకుపోవటం - తర్వాత కోర్టు జోక్యంతో తీరిగ్గా తప్పులు దిద్దుకోవటం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మామూలైపోయింది. దీన్నే పెద్దలు ’అడుసు తొక్కనేల కాలు కడగనేల’ అని ఎప్పుడో చెప్పారు. బహుశా ఈ సామెత ఏపీ సర్కారుకు గుర్తులేదేమో.