Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో కరోనాకి విరుగుడు!

By:  Tupaki Desk   |   17 April 2020 6:10 AM GMT
హైదరాబాద్ లో కరోనాకి విరుగుడు!
X
హైదరాబాద్‌ లో మరో ఘరానా మోసం బయటపడింది. కరోనాకి ఇదే అసలైన విరుగుడు అంటూ ప్రజలని మోసం చేస్తున్న ఒక ముఠా గుట్టుని పోలీసులు రట్టు చేసారు. కరోనా పట్ల జనాల్లో ఉన్న ఆందోళనను క్యాష్ చేసుకునేందుకు నయా దందాకు తెరలేపిన ఓ గ్యాంగ్ మోసాలను హైదరాబాద్ పోలీసులు, పక్కా ప్రణాళికలతో బయటపెట్టారు. అయితే, ప్రపంచ దేశాల సైంటిస్టులే కరోనా కి వ్యాక్సిన్ కనిపెట్టడానికి తలలు పట్టుకుంటుంటే ..వీరు మాత్రం ఇదే కరోనాకి విరుగుడు అంటూ ప్రచారం చేసి ...అమాయకమైన ప్రజలని నమ్మించి , క్యాష్ చేసుకుంటున్నారు.

అసలు ఈ వ్యవహారం ఎలా జరిగింది ..ఎలా బయటపడింది అంటే ? హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రతీ ఏటా మృగశిర కార్తే సమయంలో బత్తిని సోదరులు ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు చేప మందు పంపిణీ చేసే సంగతి తెలిసిందే. ప్రతీ ఏటా దాదాపు 1లక్ష మంది చేప మందు తీసుకోవడానికి కోసం వస్తారు.

దీన్ని ఆసరాగా తీసుకున్నా ఓ గ్యాంగ్ .. ప్రజల బలహీనతలను,బత్తిని సోదరుల ఆదరణను క్యాష్ చేసుకునేలా కొత్త దందా ప్రారంభించింది. కోవిడ్-19కి బత్తిని సోదరులు మందు కనిపెట్టారంటూ ఇంటర్నెట్‌ లో ప్రచారం చేసింది. అంతేకాదు కోవిడ్ 19 మందును ఆన్ లైన్‌ లోనే విక్రయిస్తున్నట్టు ప్రకటనలు ఇచ్చింది. ఈ విషయాన్ని బత్తిని హరినాథ్ గౌడ్ గుర్తించి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు

కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. ఆ గ్యాంగ్ పంచిన కొన్ని కరపత్రాలను, ఇంటర్నెట్ ప్రకటనలను గుర్తించారు. అందులో ఉన్న నంబర్ల ఆధారంగా వారిని సంప్రదించి, తమకూ కోవిడ్ 19 మందు కావాలంటూ కోరారు. గూగుల్ పే ద్వారా డబ్బు కూడా చెల్లించారు. దీనితో తమకి ఫోన్ చేసింది పోలీసులు అని తెలియక ..ఆ గ్యాంగ్ మేరిగ మహేంద్ర అనే యువకుడితో నకిలీ కరోనా మందును పంపించింది. 'నేచర్ కోవిడ్ అభయ' పేరుతో విక్రయిస్తున్న ఆ మందును కేవలం 6గ్రాములకు రూ.285 వసూలు చేస్తున్నారు. యువకుడు నకిలీ మందుతో చెప్పిన చోటుకి రాగానే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలని రాబట్టారు. శామీర్‌ పేటకు చెందిన బత్తిని రాజ్‌కుమార్ ,సుచిత్రకు చెందిన పంపన సుబ్బారావు, సైనిక్‌ పురిలో నివాసం నిడమర్తి ఉండే ఉదయ్ భాస్కర్లు గ్యాంగ్‌ గా ఏర్పడి ఈ దందా మొదలు పెట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది. రాజ్‌ కుమార్‌ కు బత్తిని ఇంటి పేరు ఉండటంతో దాన్నే వాడుకుంటున్నట్టు తెలిపాడు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.