Begin typing your search above and press return to search.

క‌రోనా పోరులో అగ్ర‌రాజ్య‌ చ‌ర్య‌.. విస్తుపోతున్న అమెరిక‌న్లు!

By:  Tupaki Desk   |   23 May 2021 1:30 PM GMT
క‌రోనా పోరులో అగ్ర‌రాజ్య‌ చ‌ర్య‌.. విస్తుపోతున్న అమెరిక‌న్లు!
X
‘‘ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్‌.. ఇన్ ల‌వ్ అండ్ వార్‌..’’ అనేది ప్రఖ్యాత నానుడి. ప్రేమలో, యుద్ధంలో గెలవడానికి ఏది చేసినా తప్పుకాదు అని దీనర్థం. ఇప్పుడు ప్ర‌పంచం మొత్తం క‌రోనాపై యుద్ధం చేస్తోంది. అయితే.. కొవిడ్ కు క్యూర్ లేనందున వ్యాక్సిన్ మాత్ర‌మే ముంద‌స్తు ఆయుధంగా భావిస్తోంది ప్ర‌పంచం. అందుకే.. వీలైనంత త్వ‌ర‌గా అంద‌రికీ వ్యాక్సిన్ వేయాల‌ని చూస్తున్నాయి.

అయితే.. ఈ యుద్ధంలో సైనికులుగా ఉండాల్సిన జ‌నం మాత్రం పూర్తిగా స‌మ‌రం సాగించ‌ట్లేదు. భార‌త్ లాంటి చోట్ల వ్యాక్సిన్ కొర‌త వేధిస్తుండ‌గా.. పుష్క‌లంగా అందుబాటులో ఉన్న అమెరికాలో జ‌నాలు బ‌ద్ధ‌కిస్తున్నారట‌. నిత్యం న‌మోద‌వుతున్న వ్యాక్సినేష‌న్ రికార్డులే ఈ మాట చెబుతున్నాయి. దీంతో.. వ్యాక్సిన్ వైపు జ‌నాన్ని ఆక‌ర్షించేందుకు స‌రికొత్త ప్లాన్లు వేస్తోంది అగ్ర‌రాజ్యం.

అయితే.. ఇందుకోసం ప్ర‌భుత్వ‌మే నేరుగా డేటింగ్ ను ప్రోత్స‌హించేలా ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ‘‘మీరు క‌రోనా వ్యాక్సిన్ తీసుకుంటే.. మీకు డేటింగ్ భాగ‌స్వామి దొర‌క‌డం మ‌రింత ఈజీ అవుతుంది. ఆల‌స్యం చేయ‌కుండా వ్యాక్సిన్ తీసుకోండి.. డేట్ కు వెళ్లండి’’ అంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ సలహాదారు ఆండీ స్లావిట్ ప్రకటన చేయడం విస్తు గొలుపుతోంది.

ఈ ప్ర‌క‌ట‌న చేస్తే.. వ్యాక్సినేష‌న్‌ ఎలా పెరుగుతుంద‌ని అంటారా? అమెరికాలో దాదాపు స‌గం యువ‌త డేటింగ్ యాప్ ల‌తోనే గ‌డిపేస్తున్నారు. వీళ్లంతా ఏదో ఒక డేటింగ్ యాప్ లో మెంబ‌ర్ గా ఉన్నార‌ట. దీంతో.. వాళ్ల భాష‌లోనే చెబితే.. అర్థ‌మ‌వుతుంద‌ని ఈ ప్ర‌చారాన్ని కూడా వాడేస్తున్నారు.

అయితే.. ఒక‌సారి ప్ర‌క‌ట‌న చేసి ఊరుకోకుండా.. డేటింగ్ సైట్ల‌లోనూ వ్యాక్సినేష‌న్ ప్ర‌చారం మొద‌లు పెట్టారు. ఇందులో భాగంగా డేటింగ్ యాప్ లోని స‌భ్యుల‌కు వ్యాక్సినేష‌న్ బ్యాడ్జి అనే కొత్త ఫీచ‌ర్ ను తీసుకొస్తున్నారు. ఈ బ్యాడ్జి వ‌ల్ల వారు వ్యాక్సిన్ తీసుకున్నారా? లేదా ? అనే విష‌యం తెలుస్తుంద‌ట‌. సో.. తాము డేట్ కు వెళ్లాల‌ని భావించే వారు వ్యాక్సిన్ తీసుకోక‌పోతే.. వారికోస‌మైనా వ్యాక్సిన్ తీసుకోవాల‌నే విధంగా ప్ర‌చారం చేస్తున్నారు. మ‌రి, ఇది ఎంత మేర ఫ‌లితం ఇస్తుందో తెలియ‌దుగానీ.. డేటింగ్ యాప్ ల‌ను కూడా వ‌ద‌ల‌క‌పోవ‌డంతో ఫ‌న్నీ సెటైర్స్ వేస్తున్నారు నెటిజ‌న్లు.