Begin typing your search above and press return to search.

అంద‌రూ కోరుకునేదే.. కేటీఆర్ ట్వీట్ కూడా అదే!

By:  Tupaki Desk   |   19 Sep 2022 5:30 AM GMT
అంద‌రూ కోరుకునేదే.. కేటీఆర్ ట్వీట్ కూడా అదే!
X
చాలా బ‌హుళ జాతి సంస్థ‌లు మ‌న‌దేశంలో త‌మ సేవ‌ల‌ను ఇంగ్లిష్‌, హిందీల్లో మాత్ర‌మే అందిస్తున్నాయి. భార‌త రాజ్యాంగం అధికారికంగా దేశంలో గుర్తించిన భాష‌లే 22 ఉన్నాయి. ఇంకా ఎన్నో వంద‌ల భాష‌లు మాట్లాడే ప్ర‌జ‌లు ఉన్నారు. వారు వివిధ బ‌హుళ‌జాతి సంస్థ‌లు లేదా బ్యాంకులు లేదా కంపెనీల సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌నుకున్న‌ప్పుడు ఎదుర‌వుతున్న అతిపెద్ద అడ్డంకి.. భాష‌. దేశంలో ఉన్న‌వారంద‌రికీ ఇంగ్లిష్‌, హిందీ రావు.

చ‌దువుకున్న‌వారికి కూడా చాలామందికి అంతంత‌మాత్రంగానే ఇంగ్లిష్ వ‌చ్చు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇందుకు చూపిన చొరవ ప్ర‌శంస‌లందుకుంటోంది.

ఇండిగో సంస్థ‌కు చెందిన విమానంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన‌ ఒక మ‌హిళ విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్ వెళ్తోంది. ఆమె విండో సీటు (కిటీకి ప‌క్క‌న‌) కూర్చుంది. సాధారంగా విండో పక్క‌న‌, ఎమ‌ర్జెన్సీ డోర్ ద‌గ్గ‌ర కూర్చున్న ప్ర‌యాణికుల‌కు విమాన‌యాన సంస్థ‌లు కొన్ని సూచ‌న‌లు జారీ చేస్తాయి. ఈ క్ర‌మంలో ఎయిర్‌హోస్టెస్ ఆ ప్రయాణికురాలికి ఇంగ్లిష్‌లో కొన్ని సూచ‌న‌లు జారీ చేశారు. అయితే ఆ ఏపీ మ‌హిళకు తెలుగు మాత్ర‌మే వ‌చ్చు. ఇంగ్లిష్‌, హిందీ రావు. ఎయిర్‌హోస్టెస్‌కు తెలుగు రాదు. కేవ‌లం ఇంగ్లిష్‌, హిందీ మాత్ర‌మే వ‌చ్చు.

మొద‌ట ఆ మ‌హిళ‌కు 6E 7297 ఇండిగో విమానంలో 2A (ఎక్స్ఎల్) నంబ‌ర్ సీటు కేటాయించారు. అయితే ఆమె సీటును బ‌ల‌వంతంగా 3C కి మార్చారు. సెక్యూరిటీ కారణాల‌తో సీటు మారుస్తున్నామ‌ని ఆమెకు ఎయిర్‌హోస్టెస్‌ ఇంగ్లిష్‌లో చెప్పారు. అయితే ప్ర‌యాణికురాలికి తెలుగు మాత్ర‌మే రావ‌డం వ‌ల్ల ఎయిర్‌హెస్టెస్‌కు స‌రిగా స‌మాధానం ఇవ్వ‌లేక‌పోయారు. ఈ ఘ‌ట‌న‌ను అదే విమానంలో ప్ర‌యాణిస్తున్న ఐఐఎం అహ్మ‌దాబాద్ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ దేవ‌స్మిత చ‌క్ర‌వ‌ర్తి ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు.

ఈ వ్య‌వ‌హారం దేశవ్యాప్తంగా వైర‌ల్ అయ్యింది. ఇండిగో వ్య‌వ‌హార‌శైలిపై నెటిజ‌న్లు నిప్పులు చెరిగారు. దేశంలో హిందీ, ఇంగ్లిష్ త‌ప్ప ఇత‌ర భాష‌లు లేవా? అని నిల‌దీశారు. ఆయా రాష్ట్రాల్లో విమానాలు తిరుగుతున్న‌ప్పుడు స్థానిక ప్రాంతీయ భాష‌లు వ‌చ్చిన సిబ్బంది విమానాల్లో ఉండాలి క‌దా అని నిల‌దీశారు. ప్రాంతీయ భాష‌లు మాట్లాడే వారిపై ఇండిగో వివక్ష చూపుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

ఇదే విష‌య‌మై తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం ట్వీట్ చేశారు. ఈ మేర‌కు ఇండిగోను ట్యాగ్ చేస్తూ ఆయ‌న ట్వీట్ చేశారు. ఆయా రాష్ట్రాల్లో విమానాలు న‌డుతున్న‌ప్పుడు స్థానిక భాష‌లు వ‌చ్చిన‌వారినే విమానాల్లో నియ‌మించాల‌ని కోరారు. ముఖ్యంగా ప్రాంతీయ మార్గాల్లో తెలుగు, త‌మిళం, క‌న్న‌డం వంటి ప్రాంతీయ భాష‌ల‌ను మాట్లాడ‌గ‌లిగిన సిబ్బందిని నియ‌మించుకోవాల‌ని ఇండిగో విమానయాన సంస్థ‌కు సూచించారు. త‌ద్వారా ఇంగ్లిష్ లేదా హిందీ మాట్లాడలేని వారిని గౌర‌వించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.