ఈ దొంగ చాలా వెరైటీ. ముందు దొంగతనం చేయడానికి అనువైన ఇంటిని గుర్తిస్తాడు. ఆ తర్వాత ఆ ఇంట్లోకి ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా వెళ్లి ఉన్నదంతా ఊడ్చుకెళ్తాడు. ఇలా ఒకటి రెండు కాదు ఏకంగా 60 చోరీలు చేశాడు. ఎట్టకేలకు అతడు విశాఖ పోలీసులకు చిక్కాడు. అతడితో పాటు అతడికి సహకరించే తోడు దొంగను కూడా అరెస్టు చేసినట్లు విశాఖ -1 డీసీపీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. జూలై 20న విశాలాక్షి నగర్ లోని ఆర్ యస్ఐ ఇళ్లు, దువ్వాడ ఎయిర్ పోర్టు, అనకాపల్లి కశిం కోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల వరుసగా చోరీలు
జరిగాయి.
పోలీసులు ఈ ప్రాంతాల్లోనే సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా ఓ వ్యక్తి ఒంటిపై నూలు పోగు లేకుండా ఇళ్లలోకి ప్రవేశించి దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించారు. అతడు గుంటూరు జిల్లా పొన్నూరు చెందిన పాత నేరస్తుడు కంచర్ల మోహన్ రావు(40)గా గుర్తించారు. తుని సమీపంలో తిరుగుతుండగా ఈనెల 11న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనాల్లో అతనికి సహాయపడుతున్న అనకాపల్లి మండలం తమ్మయ్య పేట వెంకుపాలెం సంతోష్ కుమార్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మోహన్ రావు దొంగతనాలు చేయడంలో బాగా ఆరితేరి పోయాడు. ఒకవేళ చోరీకి వెళ్లి పట్టుబడ్డా తప్పించుకోవడం అతడి స్టైల్. ముందుగా అతడు ఏ ఇళ్లయితే దొంగతనానికి అనుకూలంగా ఉంటుందో గుర్తించడం కోసం రెక్కీ నిర్వహిస్తాడు.
ఇంటిని గుర్తించిన తర్వాత అర్ధరాత్రి సమయంలో సంతోష్ కుమార్ మోహన్ రావును బైక్ పై తీసుకెళ్లి ఆ ఇంటి వద్ద దింపుతాడు. అక్కడ మోహన్ రావు తన ఒంటిపై దుస్తులన్నీ తీసేసి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఒక్కొక్కసారి అండర్వేర్, చేతులకు బ్లౌజులు వేసుకుని లోపలికి వెళ్తాడు. చాకచక్యంగా ఇంట్లోని వస్తువులను చోరీ చేసి బయటపడతాడు. మోహన్ రావు నగ్నంగా దొంగతనం ఎందుకు చేస్తాడంటే చోరీ చేసే సమయంలో ఎవరైనా చూసినా నగ్నంగా ఉంటే సైకో గా భావించి దగ్గరికి రావడానికి జంకుతారని, ఆ లోగా ఏదోక విధంగా అక్కడి నుంచి తప్పించుకొని పోవచ్చని అతడి ఉద్దేశం. ఈ టక్కరి దొంగను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. అనకాపల్లిలో ఓ ఫైనాన్స్ సంస్థలో అతడు తాకట్టు పెట్టిన 20 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.