Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రం సంచలన నిర్ణయం.. ఇళ్లకే మద్యం పంపిణీ!

By:  Tupaki Desk   |   24 April 2023 2:28 PM GMT
ఆ రాష్ట్రం సంచలన నిర్ణయం.. ఇళ్లకే మద్యం పంపిణీ!
X
తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇళ్లకు, శుభకార్యాలకు మద్యం పంపిణీకి అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. పెళ్లిళ్లలోనూ, ఇతర శుభాకార్యల్లోనూ మద్యం సేవించడానికి అధికారికంగా అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు వాణిజ్య సముదాయాలు, కాన్ఫరెన్స్‌ హాల్స్, కన్వెన్షన్‌ సెంటర్లు, మ్యారేజ్‌ హాల్స్, బాంక్వెట్‌ హాల్స్, స్పోర్ట్స్‌ స్టేడియాల్లోనూ మద్యం అమ్మకాలకు స్టాలిన్‌ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

మద్యం మీద భారీ ఎత్తున ఆదాయం సంపాదించడమే లక్ష్యంగా తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు క్లబ్బులు, స్టార్‌ హోటల్స్‌ కి మాత్రమే మద్యం వినియోగం కోసం లైసెన్స్‌ ఇచ్చేవారు.

ఇక ఇప్పుడు ఇళ్లల్లో వివిధ ఫంక్షన్లు, ఉత్సవాలు, క్రీడా స్టేడియాలు, జాతీయ, అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలకు మద్యం సరఫరా చేయొచ్చు. వీటన్నింటికి మద్యం సరఫరా చేయాలంటే లైసెన్సులు తప్పనిసరి. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం 'ఎఫ్‌.ఎల్‌.12' అనే ఒక ప్రత్యేక లైసెన్స్‌ ని ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ ని కూడా తమిళనాడు ఎక్సైజ్‌ శాఖ గత నెలలోనే జారీ చేసింది.

మద్యం అమ్మకాల ద్వారా పెద్ద ఎత్తున నిధులను సమీకరించుకోవాలని తమిళనాడు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగానే మద్యం అమ్మకాలు పెంచుకోవడానికి ఈ ప్రత్యేక లైసెన్సుని అందుబాటులోకి తెచ్చింది.

కాగా ఈ ప్రత్యేక లైసెన్సును ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ లేదా అసిస్టెంట్‌ కమిషనర్‌ జారీ చేస్తారు. ఈ లైసెన్సు ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే చెల్లుబాటవుతుంది. ఈ లైసెన్సు ద్వారా అతిథులు, సందర్శకులతోపాటు అంతర్జాతీయ లేదా జాతీయ ఈవెంట్‌లలో పాల్గొనేవారికి మద్యం సరఫరా చేయొచ్చు.

ఈ లైసెన్సు కోసం సంబంధింత ఈవెంట్‌/ఫంక్షన్‌ కు వారం ముందు ఆన్లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ప్రభుత్వాన్నికి రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. ఇందులో భాగంగా వాణిజ్యపరమైన ఈవెంట్లకు వార్షిక రుసుము కింద మున్సిపల్‌ కార్పొరేషన్‌ లలో రూ. లక్ష చెల్లించాల్సి ఉంటుంది. అదే మున్సిపాలిటీల్లో అయితే ఏడాదికి రూ. 75వేలు, ఇతర ప్రదేశాల్లో రూ. 50,000 వరకు లైసెన్సు ఫీజు చెల్లించాలి.

ఇక ఇళ్లల్లో ఫంక్షన్లలో, వేడుకలకు మద్యం సరఫరా చేయాలంటే నాన్‌–కమర్షియల్‌ గా ఒక్కరోజుకి ప్రత్యేక లైసెన్స్‌ కింద మునిసిపల్‌ కార్పొరేషన్లలో రూ. 11,000, మున్సిపాలిటీల్లో రూ. 7,500, ఇతర ప్రదేశాల్లో రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది.