Begin typing your search above and press return to search.

భారత్ లోని ఆ రాష్ట్రంలో ఎక్కువ ఉరిశిక్షలు..!

By:  Tupaki Desk   |   31 Jan 2023 10:41 AM GMT
భారత్ లోని ఆ రాష్ట్రంలో ఎక్కువ ఉరిశిక్షలు..!
X
భారత్ లో పెరుగుతున్న నేరాల సంఖ్యకు ఉరిశిక్షలు అద్దం పడుతున్నాయి. ప్రభుత్వాలు.. పాలకులు.. పోలీసులు నేరాల సంఖ్యను తగ్గించడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా నానాటికీ క్రైమ్ సంఘటనలు పెరగడమే కాదు తగ్గుముఖం పట్టకపోవడం శోచనీయంగా మారుతోంది. నేరాల తీవ్రతను బట్టి ట్రయల్ కోర్టులు సైతం ఉరిశిక్షలను విధిస్తున్నాయి.

ట్రయల్ కోర్టులు ఉరిశిక్షలు విధించడం అనేది చాలా అరుదు. అయినప్పటికీ గతేడాది ట్రయల్ కోర్టులు అత్యధికంగా ఉరిశిక్షలు విధించాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2022 లో 165 మందికి కోర్టులు ఉరి శిక్షలను ఖరారు చేశాయి. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో కోర్టులు ఉరిశిక్షలు వేయడం ఇదే తొలిసారి అని గణాంకాలు చెబుతున్నాయి.

డెత్‌ పెనాల్టీ ఇన్‌ ఇండియా.. యాన్యువల్‌ స్టాటిస్టిక్స్‌ రిపోర్టు 2022 పేరుతో నేషనల్ లా యూనివర్శిటీ భారత్ లోని ఉరి శిక్షల నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారంగా 2022 సంవత్సరంలో 165 మరణ శిక్షలతో కలుపుకొని ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తున్న ఖైదీల సంఖ్య 539కి చేరింది. గతేడాది గుజరాత్‌ లో అత్యధికంగా 51 మందికి ఉరి శిక్షలు పడ్డాయి.

బాంబు పేలుడు కేసులో అహ్మదాబాద్‌ కోర్టు 38మందికి ఉరిశిక్షను ఖరారు చేసింది. 2016 తర్వాత ఒక్క కేసులో ఇంతమందికి ఉరిశిక్షను విధించడం ఇదే తొలిసారి. ఉరి శిక్ష పడిన 539 మంది ఖైదీల్లో ఎక్కువ మంది యూపీకి చెందిన వారే ఉన్నారు. ఉత్తరప్రదేశ్(యూపీ)లో మొత్తం 100 మంది ఖైదీలు ఉరి కోసం వేచి చూస్తున్నారు.

ఆ తర్వాతి స్థానంలో గుజరాత్(61) ఉంది. జార్ఖండ్‌ 49.. మహారాష్ట్ర 39.. మధ్యప్రదేశ్‌ 31.. కర్ణాటక 25.. ఉత్తరాఖండ్‌ 24.. పశ్చిమబెంగాల్‌ 23లతో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే గతేడాది ఏపీలో ఒకరికి మరణ ఖరారు కాగా.. తెలంగాణలో ఆ సంఖ్య సున్నగా ఉంది. ఉరిశిక్ష పడిన వారిలో 51.28శాతం లైంగిక నేరాలకు సంబంధిన వారేకాగా వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.

57 హత్య కేసులు.. 47 హత్య లైంగిక నేరాలు.. 39 ఉగ్రవాద నేరాలు.. 8 కిడ్నాపింగ్‌.. మర్డర్‌ కేసుల.. ఐదు చిన్నారులపై అత్యాచార కేసుల్లో గతేడాది కోర్టులు మరణదండనలు విధించాయి. 2015 తర్వాత భారత్ లో మరణ శిక్షలు పడిన వారి సంఖ్య 40 శాతం పెరిగినట్లు డెత్‌ పెనాల్టీ ఇన్‌ ఇండియా.. యాన్యువల్‌ స్టాటిస్టిక్స్‌ రిపోర్టు 2022 పేర్కొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.