Begin typing your search above and press return to search.

ఆ ఒక్క మంత్రికే.. జ‌గ‌న్ ద‌గ్గ‌ర అప్పాయింట్‌మెంట్ అక్క‌ర్లేదా?

By:  Tupaki Desk   |   20 Dec 2021 8:48 AM GMT
ఆ ఒక్క మంత్రికే.. జ‌గ‌న్ ద‌గ్గ‌ర అప్పాయింట్‌మెంట్ అక్క‌ర్లేదా?
X
ఏ రాష్ట్రంలో అయినా.. ముఖ్య‌మంత్రిని క‌ల‌వాలంటే.. ముందుగా అప్పాయింట్‌మెంట్ తీసుకోవాలి. ఇది స‌ర్వ‌సాధార‌ణం. అయితే.. మంత్రుల‌కు మాత్రం దీని నుంచి మిన‌హాయింపు ఉంటుంది.మంత్రులు ముఖ్య‌మంత్రిని క‌ల‌వాలంటే.. వారికి అప్పాయింట్‌మెంట్ల‌తో ప‌నిలేదు. నేరుగా వెళ్లి.. స‌మ‌యం చూసుకు ని.. ఓ ప‌దినిముషాలు అటు ఇటుగా.. సీఎంతో భేటీ అయి.. స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌వ‌చ్చు.

ఇది అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్న‌దే. అయితే.. ఏపీలో మాత్రం చిత్ర‌మైన రాజ‌కీయాలు క‌నిపిస్తున్నాయి. సీఎం జ‌గ‌న్ అప్పాయింట్మెంట్ కావాలంటే.. నెల‌ల త‌ర‌బ‌డి వేచిచూడాల్సిన ప‌రిస్థితి.. ఆయ‌న సొంత పార్టీ వైసీపీలోనే క‌నిపిస్తోంది.

స‌రే.. నాయ‌కులు కాబ‌ట్టి.. వారికి సంబంధించిన లేదా.. నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన స‌మస్య‌లే క‌దా.. చ‌ర్చించేది.. కాబ‌ట్టి.. సీఎం కు తీరిక లేద‌ని అనుకోవ‌చ్చు. కానీ, మంత్రులు కూడా ఇదే ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు.

ముఖ్య‌మంత్రిని క‌లిసి.. రాష్ట్రం మొత్తానికి సంబంధించిన త‌మ శాఖ ల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు కూడా.. మంత్రుల‌కు ముఖ్య‌మంత్రి ఛాన్స్ ఇవ్వ‌డం లేద‌నే వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ``మ‌న‌కే కాదు.. మన మంత్రికి కూడా అప్పాయింట్ మెంట్ లేదు!`` అని నాయ‌కులు తెగ చ‌ర్చించుకుంటున్నారు.

కొంద‌రు మంత్రులైతే.. ``అన్నా.. నాకు సీఎం ద‌ర్శ‌న భాగ్యం ద‌క్క‌డం లేదు. నీకేమైనా ల‌భించిందా?!`` అని సాటి మంత్రుల‌కు ఫోన్లు చేసుకుని స‌మాచారం సేక‌రిస్తున్నారు. అంతేకాదు.. అధికారుల‌ను కాకా ప‌ట్టే ప‌రిస్థితి వ‌స్తోంది.

నిజానికి మంత్రులు ఎవ‌రైనా.. ముఖ్య‌మంత్రిని క‌లిస్తే.. వారి వ్య‌క్తిగ‌త విష‌యాల క‌న్నా కూడా .. త‌మ శాఖ‌ల ప్ర‌యోజ‌నాలు.. రాష్ట్రం మొత్తానికి సంబంధించిన అంశాల‌పైనే చ‌ర్చిస్తారు. అయితే.. సీఎం జ‌గ‌న్ మాత్రం మంత్రుల‌కు కూడా అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌క‌పోగా.. నేరుగా క‌లిసే అవ‌కాశం కూడా ఇవ్వ‌డం లేద‌ట‌.

నిజానికి జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న‌వారిలో చాలా మంది జ‌గ‌న్ అంటే.. క‌ర‌డుగ‌ట్టిన అభిమానం ఉన్న‌వారే. ఆయ‌న‌పై ప‌న్నెత్తు మాట అంటే.. ఊరుకునేది లేదు.. ఇంట్లోంచి లాక్కొచ్చితంతాం! అన్న కొడాలి నాని వంటివారు చాలా మంది ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. వీరికి ఎవ‌రికీ కూడా.. జ‌గ‌న్‌ను నేరుగా ద‌ర్శించుకునే ఛాన్స్ లేదు.

``ఆ శ్రీవారి ద‌ర్శ‌నం అయినా.. ఓ రెండు గంట‌లు క‌ష్ట‌ప‌డితే.. దొరుకుతుందే మో.. మా సీఎం మాత్రం క‌రుణించ‌డం లేదు`` అని ఒక‌రిద్ద‌రు మంత్రులు ఆఫ్‌ది రికార్డుగా.. కొన్నాళ్ల కింద‌ట చేసిన వ్యాఖ్య‌లు బాగానే వైర‌ల్ అయ్యాయి. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది.

సీఎం జ‌గ‌న్ ఉద్దేశంలో మంత్రుల‌కు స‌బ్జెక్ట్ లేదు. వారికి ఏమీ తెలియ‌దు! అనే భావ‌న స్థిర‌ప‌డిప‌డిపోయిం ద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో ఒకే ఒక్క మంత్రికి మాత్రం ఎలాంటి అప్పాయింట్మెంట్ లేకుండా .. సీఎంను క‌లిసే అవ‌కాశం ఇస్తున్నార‌ట‌. ఆయ‌నే చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రా రెడ్డి. ఆయ‌న‌కు మాత్ర‌మే అన్నీ తెలుసు.. అనే ధోర‌ణిలో సీఎం ఉన్నార‌ట‌. అందుకే.. జ‌గ‌న్ ప్ర‌భుత్వ హ‌యాంలో వ‌చ్చిన అన్ని ఎన్నిక‌ల్లోనూ.. బాధ్య‌త ఈయ‌న‌కే అప్ప‌గించారు.

తిరుప‌తి పార్ల‌మెంటు, బ‌ద్వేలు ఉప ఎన్నిక‌, స్థానిక సంస్థ‌లు.. కార్పొరేష‌న్లు.. ఇలా ఏది జ‌రిగినా.. పెద్దిరెడ్డి మంత్రాంగ‌మే ముందు ఉంటుంది. సో.. పెద్దిరెడ్డికే అన్నీ తెలుసు అనే ధోర‌ణిలో జ‌గ‌న్ ఉండ‌డంతో ఆయ‌న‌కు మాత్ర‌మే ఎలాంటి అప్పాయింట్మెంట్ లేకుండా.. జ‌గ‌న్‌ను క‌లిసే అవ‌కాశం ఇస్తున్నార‌ట‌. ఇదే ఇప్పుడు వైసీపీ మంత్రుల మ‌ధ్య నేత‌ల మ‌ద్య చ‌ర్చ‌నీయాంశంగా మార‌డం గ‌మ‌నార్హం.