Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను టార్గెట్ చేసిన ఆ మీడియా అధినేత

By:  Tupaki Desk   |   23 Jan 2023 11:00 AM GMT
కేసీఆర్ ను టార్గెట్ చేసిన ఆ మీడియా అధినేత
X
సాధారణంగా నేటి కాలంలో చాలా మీడియా సంస్థలు ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంటున్నాయి. తమ మీడియా సంస్థలు ప్రభుత్వం నుంచి ఎలాంటి చిక్కుల్లో పడకుండా భజన వ్యాసాలు రాస్తున్నాయి. ఈ పరిస్థితి తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దేశంలో తెలంగాణ తప్ప ఇంకే రాష్ట్రం అభివృద్ధి కాలేదని, ఇక్కడి సంక్షేమ పథకాలను దేశ ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు. కానీ అసలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనే పరిస్థితి బాగాలేదు. కొన్ని ప్రాంతాల్లో వేసవి ఇంకా రాకముందే ట్యాంకర్లతో నీటిని తెచ్చుకొని వాడుకుంటున్న పరిస్థితి. ఈ తరుణంలో ఓ పత్రికాధినేత ధైర్యం చేశాడు. రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలను బయటపెట్టేందుకు ముందుకు వచ్చాడు.

తెలంగాణ దళితుల కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు ను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేసీఆర్ పలు సందర్భాల్లో చెబుతున్నారు. కానీ గత బడ్జెట్ లో దళిత బంధు కోసం కేటాయించిన మొత్తాన్ని కేసీఆర్ ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదని ఆ పత్రిక వివరాలను బయటపెట్టింది. సొంత రాష్ట్రంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక దేశంలో ఏ విధంగా అమలు చేస్తారని కడిగిపారేసింది.

కాగ్ లెక్కల ప్రకారం దళిత బంధు కోసం 17,700 కోట్లు కేటాయించారు. కానీ ఈ కేటాయింపులతో ఎవరికీ లాభం జరగలేదు. పైపైన ప్రచారం తప్ప వాస్తవ లబ్ధిదారులకు ఇచ్చింది ఏమీలేదని ఆ పత్రిక తెలిపింది.

వాస్తవానికి ఆంధ్రాలో కొన్ని మీడియా సంస్థలు అక్కడి ప్రభుత్వంలోని తప్పులు ధైర్యంగా ప్రచురిస్తాయి. కానీ తెలంగాణకొచ్చేసరికి ఇక్కడి ప్రయోజనాల దృష్ట్యా కేసీఆర్ కు ఎవరూ వ్యతిరేకంగా వార్తలు రాయడానికి ముందుకు రారు.

కానీ ఆ పత్రిక మాత్ర మిగతా వాటికి భిన్నంగా బీఆర్ఎస్ ప్రభుత్వ లోపాలన్నింటినీ బయటపెడుతోంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి తెలంగాణను వాడుకుంటున్నాడే తప్ప ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏమీ లేదని పేర్కొంది. అంతేకాకుండా ఎడిటోరియల్ లో సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి రాయడంపై తీవ్రంగా చర్చ సాగుతోంది.

అయితే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ మీడియా అధినేత కేసీఆర్ ను టార్గెట్ చేశారని కొందరు అంటున్నారు. కానీ నిజనిజాలు బయటపెట్టడం పత్రిక ధర్మం. ఆధారాల ద్వారా తప్పులను బయటపెట్టడానికి కూడా ధైర్యం కావాలి కదా..? అని మరికొందరు సమాధానం ఇస్తున్నారు. ఏదీ ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే ఇలాంటి పత్రికల మాదిరిగా నిజనిజాలు బయటపెట్టాలని కొందరు కోరుతున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో మీడియా సంస్థల తీరు ఎలా ఉంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.