Begin typing your search above and press return to search.

సీఎం అయినా చంటిగాడి ముందు తలవంచాల్సిందేనా?

By:  Tupaki Desk   |   2 May 2021 8:30 AM GMT
సీఎం అయినా చంటిగాడి ముందు తలవంచాల్సిందేనా?
X
'ఇక్కడ లోకల్' అంటూ చెప్పే మాటలో ఉండే బలం మరే మాటలోనూ కనిపించదు. అందునా.. స్థానికంగా మంచి పలుకుబడి ఉన్నప్పుడు.. తన ఎదురున్నది ముఖ్యమంత్రి అయినా తలొగ్గక తప్పదన్న విషయాన్ని నందిగామ్ ఎన్నికల ఫలితం అందరికి అర్థమయ్యేలా చేస్తోంది. ఇప్పటివరకు వెలువడిన రౌండ్ల ఫలితాల్ని చూస్తే.. మొదట్నించి వెనుకబడిన మమత.. తాజాగా అధిక్యతలోకి వచ్చింది. పూర్తి ఫలితం వెల్లడయ్యేవరకు ఉత్కంటే. ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. బెంగాల్ ఎన్నికల ఫలితాలు విశ్లేషకులు అంచనాలకు మించి మమత పార్టీ దూసుకెళుతోంది. పార్టీ ఘన విజయం సాధిస్తుందన్న విషయాన్ని అధిక్యతలు స్పష్టం చేస్తున్నా.. ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోవటం లేదు. అందరి చూపు ఇప్పుడు సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్ ఫలితం మీదనే ఉంది. ఎందుకంటే.. ఒకప్పుడు దీదీకి కుడిభుజంగా ఉన్న సువేందు ఆమెకు హ్యాండిచ్చి బీజేపీలోకి వెళ్లటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో జరిగిన మాటల యుద్ధంలో సువేందు మీద తాను పోటీ చేసి గెలుస్తానని మమతమ్మ చెప్పటం.. మాట వరసకు అన్న మాటను సీరియస్ గా తీసుకొన్న ఆమె.. అన్న మాటకు కట్టబడి బరిలోకి దిగారు. పశ్చిమబెంగాల్ కు దీదీ తిరుగులేని అధినేత్రి కావొచ్చు. కానీ.. నందిగ్రామ్ లో ఆమె బలమంతా సువేందునే. అలాంటి నేత తనకు హ్యాండిచ్చినప్పుడు.. ఆమె బలం ప్రశ్నార్థకమే. అందునా.. పోటాపోటీగా ఎన్నిక జరుగుతున్నప్పుడు.. ఇజ్జత్ కా సవాల్ అన్న పరిస్థితే ఎదురైతే.. స్థానికంగా ఉన్న వారంతా లోకల్ చంటిగాడికి ప్రాధాన్యత ఇస్తారే తప్పించి.. సీఎంను సైతం లైట్ తీసుకుంటారు.

ఈ చిన్న లాజిక్ ను మమత మిస్ అయ్యారు. తన మీద తనకున్న ఆత్మవిశ్వాసం.. సువేందుకు బలాన్ని తక్కువగా అంచనా వేయటంతో పాటు.. ఇష్యూను పర్సనల్ గా తీసుకున్న మమత ఎన్నికల బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలోనూ.. పోలింగ్ జరిగిన సమయంలోనూ చోటు చేసుకున్న పరిణామాలు చూసినప్పుడే.. ఏదో తేడా కొట్టినట్లుగా అనిపించింది. దీనికి తోడు బీజేపీకి ఉన్న ఆశావాహ తీరు ఆయన్ను మరింత మొండిగా మార్చి ఉండొచ్చు.

గుర్రం ఎగరావచ్చన్నట్లుగా ఆయన తనకున్నఅన్ని శక్తుల్ని ప్రదర్శించారు. ఈ కారణంతోనే నందిగ్రామ్ లో పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్ని గుర్తు తెచ్చుకుంటే.. కొన్నిచోట్ల రిగ్గింగ్ జరుగుతుందని ఆరోపిస్తూ సీఎం హోదాలో ఉన్న మమత.. ఆయా పోలింగ్ బూత్ ల వద్దకు వెళ్లి నిరసన చేయటాన్ని మర్చిపోకూడదు. తనను ఇరుకున పెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాల్ని గుర్తించి.. మరోచోట కూడా పోటీ చేసి ఉంటే బాగుండేది.

కానీ.. ఆమె ఈగోను టచ్ చేసిన బీజేపీ.. ఆమె మరోచోట పోటీ చేయకుండా ఉండేలా చేయటంలో సక్సెస్ అయ్యారు. తాను పెట్టుకున్నది లోకల్ చంటిగాడితోనూ.. మోడీషాలతో అన్న విషయాన్ని గుర్తించి.. అనవసరమైన ఆవేశానికి లోను కాకుంటే.. ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేదని చెప్పక తప్పదు.

ఇప్పటివరకు వెల్లడైన ఫలితాన్ని చూస్తే.. మమత వెనుకబడి ఉన్నారు. తాజాగా ఆమె అధిక్యతలోకి వచ్చారు. అయితే.. తుది ఫలితం ఎలా ఉంటుందన్నది చెప్పలేని పరిస్థితి. అసలు దీదీ నందిగ్రామ్ కాకుండా మరెక్కడ పోటీ చేసినా.. సునాయాసంగా గెలిచేవారు. అందుకు భిన్నంగా లోకల్ చంటిగాడితో పెట్టుకున్న ఆమె.. ఇప్పుడు చెమటలు చిందించాల్సి వస్తోంది. సునాయసంగా వచ్చే విజయాన్ని ఆయాసపడిపోయి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది?