Begin typing your search above and press return to search.

పాక్ జైల్లో భారతీయుల్ని ఎలా చూస్తారో చెప్పాడు

By:  Tupaki Desk   |   2 Jun 2021 2:30 PM GMT
పాక్ జైల్లో భారతీయుల్ని ఎలా చూస్తారో చెప్పాడు
X
పాకిస్థాన్ అంటేనే పళ్లు నూరేవాళ్లు మన దగ్గర చాలామంది కనిపిస్తారు. డెబ్భై ఏళ్ల క్రితం వాళ్లు ఎవరు? మనతోటి వాళ్లే కదా? మన దాయాదులే కదా? అని ఎవరైనా అంటే.. అతడ్ని దేశద్రోహిగా చూసినా ఆశ్చర్యం లేదు. పాకిస్థానీయుడ్ని భారతీయులు ఎలా చూస్తారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి.. పాకిస్తాన్ లో భారతీయుల్ని ఎలా చూస్తారు. అందునా.. పాక్ లోకి అక్రమంగా ప్రవేశించి భద్రతా సిబ్బందికి దొరికిపోతే.. ఏం చేస్తారు? ఎలా ట్రీట్ చేస్తారన్న విషయాలకు సంబంధించిన తనకు ఎదురైన అనుభవాల్ని వెల్లడించాడు ప్రశాంత్.

ఎవరీ కుర్రాడంటారా? తాను ప్రేమించిన అమ్మాయి స్విట్జర్లాండ్ లో ఉందని.. ఆమె కోసం కాలి నడకన వెళ్లేందుకు భారత్ సరిహద్దు దాటి పాక్ బోర్డర్ లోకి ఎంట్రీ అయి అక్కడి భద్రతా సిబ్బందికి చిక్కిన విశాఖపట్నం కుర్రాడే ప్రశాంత్. హైదరాబాద్ నుంచి స్విట్జర్లాండ్ వెళ్లేందుకు వయా పాకిస్థాన్ మీదుగా వెళ్లే ప్రయత్నం చేసిన అతడు దొరికిపోవటం.. పాక్ ఆర్మీ వద్ద.. జైల్లో నాలుగేళ్లు మగ్గిపోయిన అతడు తాజాగా హైదరాబాద్ కు రావటం తెలిసిందే. సైబరాబాద్ సీపీ సజ్జన్నార్ పుణ్యమా అని.. ఆయన ప్రత్యేక చొరవ చూపించటం.. ప్రశాంత్ విడుదల కోసం రెండుసార్లు ఢిల్లీకి వెళ్లి రావటం లాంటివెన్నో చేయటంతో అతడు పాకిస్థాన్ నుంచి క్షేమంగా భారత్ కు చేరుకున్నాడు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ కొన్ని ఆసక్తికర అంశాల్ని వెల్లడించాడు. పాక్ బోర్డర్ లో ఎవరూ చూడకుండా కంచె దూకి.. అక్రమంగా ప్రవేశిస్తే తనను ఎవరూ పట్టుకోలేదని.. పాక్ లో ప్రవేశించిన తర్వాత దాదాపు 40 కిలోమీటర్లు తాను నడిచినట్లుగా చెప్పాడు. విపరీతంగా అలిసిపోయి సొమ్మసిల్లి పడిపోయిన తనను పాక్ హైవే పెట్రోల్ వాహనం వారు తనను పట్టుకున్నట్లు చెప్పారు.

తన గురించి తెలుసుకున్న తర్వాత పాక్ భద్రతా సిబ్బంది మానవత్వం చూపారని.. తాను తప్పు చేయలేదని నమ్మిన ఒక అధికారి తన వీడియోను భారత్ లో వైరల్ అయ్యేలా చేశారని.. ఆ కారణంగా అతడు సస్పెండ్ అయిన విషయాన్ని వెల్లడించారు. పాకిస్థాన్ జైల్లో ఏ భారత ఖైదీతో పని చేయించరని.. అక్కడి భద్రతా సిబ్బంది మానవత్వంతో వ్యవహరించే వారన్నారు.

పాకిస్థాన్ లో ఉన్న ఖైదీలను ముస్లింలుగా మారమని అడుగుతారని.. తాను మారనని శివుణ్ని ప్రార్థిస్తానని చెప్పానని చెప్పారు. తాను ఇండియా.. పాక్ ల కోసం ప్రార్థనలు చేసినట్లు చెప్పారు. పాకిస్థాన్ జైళ్లలో చాలామంది భారతీయులు ఉన్నారని.. వారంతా తమ శిక్ష పూర్తి చేసుకున్న తర్వాత కూడా అలానే మగ్గిపోతున్నారని చెప్పాడు. తన తల్లి చెప్పిన మాట వినకుండా తప్పుచేశానని.. ఎవరూ అలాంటి తప్పు చేయొద్దని వేడుకున్నాడు. ప్రశాంత్ మాటలన్ని విన్న తర్వాత.. పాకిస్థానీయులు మనం అనుకున్నంతగా.. మన పట్ల ద్వేష భావంతో ఉండరన్న భావన కలుగక మానదు.