Begin typing your search above and press return to search.

చిరంజీవికి క్యాన్సర్ అన్న బ్రేకింగ్ వార్త వెనుక అంత జరిగిందట!

By:  Tupaki Desk   |   4 Jun 2023 9:59 AM GMT
చిరంజీవికి క్యాన్సర్ అన్న బ్రేకింగ్ వార్త వెనుక అంత జరిగిందట!
X
నిక్షేపంగా ఉన్న వారిని 'న్యూస్’ లో నిర్దాక్షిణ్యంగా చంపేయటం.. అనారోగ్యంగా ఉన్న ప్రముఖుల్ని బ్రేకింగ్ న్యూస్ పేరుతో వెంటిలేటర్ మీదకు ఎక్కించేయటం లాంటి దారుణమైన తప్పులు చేసే టీవీ మీడియా పుణ్యమా అని మరో రచ్చ చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం ఒక్కసారిగా దాదాపుగా తెలుగు టీవీ చానళ్లు ఒక బ్రేకింగ్ న్యూస్ ను వేశాయి. మెగాస్టార్ చిరంజీవికి గతంలో క్యాన్సర్ బారిన పడ్డారని.. సకాలంలో వైద్యం చేయించుకొని బయటపడ్డారన్నది సారాంశం.

మెగాస్టార్ లాంటి వ్యక్తి తన నలభైలలో క్యాన్సర్ బారిన పడిన విషయాన్ని తానే స్వయంగా చెప్పారన్నంతనే.. అందరి అటెన్షన్ అటువైపు మళ్లింది. టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ పడినంతనే.. వెబ్ సైట్లలో కథనాలు కుప్పలుగా ప్రచురితం కావటం మొదలైంది. సాయంత్రం ఐదు గంటలకు మొదలైన ఈ రచ్చ రాత్రి 7 గంటల వరకు సాగింది. చివరకు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో తన అధికారిక ట్విటర్ ఖాతా నుంచి సుదీర్ఘ వివరణ ఇచ్చిన తర్వాత.. చిరు క్యాన్సర్ వార్తలకు బ్రేకులు పడ్డాయి.

ఇంతకీ ఈ బ్రేకింగ్ న్యూస్ అసలు తెర మీదకు ఎందుకు వచ్చింది? చిరు తప్పు ఎంత? అసలు మెగాస్టార్ మీద ఈ తరహా ప్రచారం సాగింది? లాంటి ప్రశ్నలు తలెత్తాయి. మీడియాలో ఉన్న పలువురు ప్రముఖులు సైతం దీని మీద ఎంక్వయిరీ చేసుకున్నారు. ఎందుకంటే.. టీవీ చానళ్లలో దాదాపుగా అందరూ ఈ వార్తను టెలికాస్ట్ చేసిన వారే. అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. షాకింగ్ నిజాలు బయటకు వస్తాయి.

హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఒకటైన స్టార్ ఆసుపత్రి వారు తమ ఆసుపత్రిలో క్యాన్సర్ విభాగాన్నిప్రత్యేకంగా స్టార్ట్ చేసి.. దానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి అతిధిగా హాజరయ్యారు. ఈ ప్రోగ్రాంకు మీడియా కవరేజ్ కావాలంటూ స్టార్ ఆసుపత్రి కోరింది. అందుకు సంబంధించిన ఇన్విటేషన్ పంపారు. అయితే.. కారణాలు ఏమైనా ప్రింట్ మీడియా నుంచి ఒక్క సీనియర్ హెల్త్ బీట్ (ఆరోగ్యం.. ఆసుపత్రులు గురించి మాత్రమే వార్తలు రాసే పాత్రికేయులు) రిపోర్టర్లు ఒక్కరు వెళ్లింది లేదు. టీవీ చానళ్ల నుంచి కూడా సీనియర్లు వెళ్లలేదు. హెల్త్ బీట్ కు సంబంధం లేకుండా అన్ని వార్తల్ని కవర్ చేసే స్థానిక విలేకరులను పంపారు.

ముఖ్య అతిధిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ.. తన నలభై ఏళ్ల వయసులో తిత్తులు లాంటివి గుర్తించారని.. భవిష్యత్తులో అవి క్యాన్సర్ కారకాలు అయ్యే అవకాశం ఉందని చెప్పటంతో.. తాను వాటిని తీయించానని పేర్కొన్నారు. క్యాన్సర్ ను ముందుగా గుర్తిస్తే చికిత్స పొందటం తేలిక అవుతుందన్న మాటల్ని చెప్పారు.దీంతో.. చిరు మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్న ఒక ప్రముఖ టీవీ చానల్ రిపోర్టర్.. మెగాస్టార్ చిరంజీవికి క్యాన్సర్ అంటూ బ్రేకింగ్ న్యూస్ వేశారు.

దీంతో.. పోటీ ప్రపంచంలో పరుగులు తీసే టీవీ చానళ్ల ప్రతినిధులు..ఆయా ఆఫీసుల్లోని ముఖ్యులు సదరుపోటీ చానల్ లో వేస్తున్న బ్రేకింగ్ న్యూస్ నేపథ్యంలో తమ రిపోర్టర్లను గదమాయించటం.. ఒకరికి మించి మరొకరు దూకుడుగా వ్యవహరిస్తూ.. పోటీలో ముందు ఉండాలన్న తపనతో చేసిన ప్రయత్నాలు.. రచ్చ రచ్చగా మారాయి. క్యాన్సర్ అవకాశాల గురించి మాట్లాడిన చిరంజీవి మాటల్ని.. క్యాన్సర్ బారిన పడినట్లుగా అర్థం చేసుకోవటం.. సంచలనం కోసం బ్రేకింగ్ న్యూస్ వేసేయటం.. అలా వేసే క్రమంలో చిరుమాటల వీడియోను చెక్ చేయటం లాంటివేమీ జరగలేదు. దీంతో.. అదిగో తోక అంటే ఇదిగో పులి అన్న చందంగా నిక్షేపంగా ఉన్న చిరంజీవి గతంలో క్యాన్సర్ బారిన పడి.. కోలుకున్నారన్న వార్తల్ని వండేశారు. దీంతో రియాక్టు అయిన మెగాస్టార్ ట్వీట్ తో వివరణ ఇవ్వటంతో.. ఈ సంచలన వార్తలకు బ్రేకులు పడ్డాయి.