Begin typing your search above and press return to search.

కరోనా చికిత్సకు ఆ కాంబినేషన్ ఏ మాత్రం మంచిదికాదట

By:  Tupaki Desk   |   27 Aug 2020 6:15 AM GMT
కరోనా చికిత్సకు ఆ కాంబినేషన్ ఏ మాత్రం మంచిదికాదట
X
వణికిస్తున్న కరోనాకు కొందరు తెలిసి తెలియక.. అందుబాటులో ఉన్న సమాచారాన్ని తీసుకొని.. తమ సొంత తెలివితేటలతో వైద్యం చేసుకుంటున్న వైనం ఎక్కువగా ఉంది. కరోనా లక్షణాలు కనిపిస్తే.. ఆ విషయాన్ని బయటకు చెప్పుకోకుండా.. మందుల్ని వాడేస్తున్నారు. లేనిపోని సమస్యల్ని తెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. కరోనా చికిత్సకు సంబంధించి ఒక కాంబినేషన్ ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు.

కరోనా చికిత్సకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మందును దీర్ఘకాలం పాటు వాడితే నష్టమని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గరిష్ఠంగా ముప్ఫై రోజుల పాటు వాడితే ఎలాంటి సమస్యలు ఉండవని.. అందుకు భిన్నంగా వినియోగిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

అన్నింటికి మించి హైడ్రాక్సీ క్లోరోక్విన్ తో పాటు.. అజిత్రోమైసిన్ కలిపి వాడితే మాత్రం సమస్యలు తప్పవని చెబుతున్నారు. ఈ రెండింటికి ఒకేసారి వాడటం వల్ల హృద్రోగ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువని వార్నింగ్ ఇస్తున్నారు. ఈ కాంబినేషన్ వాడితే.. కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. స్వల్పకాలిక కోర్సుల్లో భాగంగా హెచ్ సీక్యూ ముప్ఫై రోజుల పాటు వాడితే ఎలాంటి ప్రమాదం లేదని.. దీర్ఘకాలం వాడితే మాత్రం సమస్యలు తప్పవంటున్నారు.

ఎక్కువకాలం హెచ్ సీక్యూ వాడితే కలిగే సమస్యలపై యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ గత ఏప్రిల్ లోనే హెచ్చరించింది. తాజాగా దీనికి సంబంధించిన నివేదిక ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ లాన్సెట్ ప్రచురించింది. ఇదిలా ఉంటే.. కరోనాకు హెచ్ సీక్యూ మందు వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ లేదన్న విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం పేర్కొనటం మర్చిపోకూడదు.