Begin typing your search above and press return to search.

చేగువెరా జీవితాన్ని మార్చేసిన ఆ బైక్ ట్రిప్ !

By:  Tupaki Desk   |   9 Oct 2020 12:00 PM GMT
చేగువెరా జీవితాన్ని మార్చేసిన ఆ బైక్ ట్రిప్ !
X
ప్రపంచంలోని చాలా దేశాల్లో యువతకు చే గువేరా అంటే విపరీతమైన అభిమానం ఉంది. నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయిన వారు, చే జీవితంలో ఘట్టాల్ని తెలుసుకొని తిరిగి చైతన్యం తెచ్చుకుంటున్నారు. దక్షిణ అమెరికాలోని క్యూబాలో నియంత పాలనను వ్యతిరేకిస్తూ చేగువేరా విప్లవబాట పట్టాడు. 1951లో మెడిసిన్ చదువుతూ చే గువేరా తన ఫ్రెండ్ అల్బెర్టో గ్రనాటోతో కలిసి, 9 నెలలపాటూ టూ-వీలర్‌ పై దక్షిణ అమెరికా ఖండం అంతా తిరిగాడు. ఈ బైక్ ట్రిప్ చే గువెరా జీవితాన్ని మొత్తం మార్చేసింది. దాదాపుగా 13 వేల కిలోమీటర్లు బైక్ పై వెళ్తూ ఎంతో మంది పేద వారి జీవితాలని చూసి చలించిపోయాడు.

దీని అంతిమఉద్దేశ్యం పెరులో అమెజాన్ నది ఒడ్డునగల సాన్ పాబ్లో కుష్టువ్యాధి గ్రస్తుల ఆశ్రమంలో కొన్నివారాలు స్వచ్చందంగా సేవచేయడం. అండీస్ లోగల మాచు పిచ్చుకు వెళుతున్నపుడు, దూర గ్రామీణ ప్రాంతాలలో అణగద్రొక్కుతున్న పేదరికాన్నిచూసి ఆయన చలించిపోయారు, ఈప్రాంతంలో రైతుకూలీలు ధనికభూస్వాముల స్వంతమైన చిన్నకమతాలలో పనిచేసేవారు. తరువాత తన ప్రయాణంలో, గువేరా కుష్టు వ్యాధిగ్రస్తుల ఆశ్రమంలోని సహోదరత్వంతో ప్రత్యేకంగా ప్రభావితులయ్యారు. ఆ సమయంలో చే గువేరా రాసుకున్న నోట్స్‌ ద్వారా "ది మోటర్ సైకిల్ డైరీస్" అనే పుస్తకాన్ని ప్రచురించారు.

1955లో చే గువేరా ఫిడేల్ కాస్ట్రోని మెక్సికోలో కలిశాడు. వాళ్లు చిరకాల మిత్రులయ్యారు. ఆ తర్వాత చే గువేరా క్యూబా నియంత ఫల్జెన్సియో బటిస్టాకి వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాడు. అలాగే ఫిడేల్ నిర్వహించిన జులై 26 ఉద్యమంలో యువతను తన ప్రసంగాలతో ఉరకలెత్తించాడు. ఉద్యమం తర్వాత, ఫిడేల్ కాస్ట్రో ప్రభుత్వంలో మంత్రిగా, సెంట్రల్ బ్యాంక్ లీడర్‌గా చే పనిచేశాడు. కానీ, చేగువేరా బొలీవియాలో పేదలకు న్యాయం జరగట్లేదని భావించాడు. కాస్ట్రోని వీడి... మళ్లీ విప్లవం వైపే అడుగులు వేశాడు. బొలీవియా అడవుల్లో గెరిల్లా వార్‌లో పాల్గొన్నప్పుడు, చే చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. చేకి చెట్ల చాటు దాక్కోవడం ఇష్టం ఉండేది కాదు. తన శత్రువులకు ఎదురొడ్డి నిలిచి, పోరాడేవాడు. అందువల్ల చే సైన్యం చాలా దూకుడుగా ఉండగలిగేది. ఒక్కో సందర్భంలో శత్రు సైన్యానికి గాయాలైతే, తనే స్వయంగా ట్రీట్‌ మెంట్ చేసేవాడు.

1967 అక్టోబర్ 7న అమెరికా మద్దతుతో బొలీవియా ఆర్మీ... చే గువేరాను ప్రాణాలతో పట్టుకుంది. కానీ చే గువేరా సైన్యానికి భయపడలేదు. లొంగిపోవడానికి ఒప్పుకోలేదు. రెండ్రోజుల తర్వాత అక్టోబర్ 9న సైన్యం ఆయన్ని కాల్చి చంపింది. మృతదేహాన్ని ప్రపంచానికి చూపించలేదు. 1995లో ఏడాది పాటూ వెతికిన తర్వాత... చే గువేరా మృతదేహాన్ని గుర్తించారు. పరిశోధకులు అది చే మృతదేహమే అని తేల్చాక ఆయనతోపాటూ మరో ఆరుగురు కొలీగ్స్ మృతదేహాల్ని కూడా క్యూబా తెచ్చి, సైనిక వందనాలతో 1997 అక్టోబర్ 17న ఖననం చేశారు. ఆయన మరణించిన తరువాత, అతడి విలక్షణ శైలి కలిగిన ముఖాకృతి ప్రపంచవ్యాప్తంగా విప్లవభావాల సంస్కృతికి ప్రపంచ చిహ్నంగా మారింది.