Begin typing your search above and press return to search.

థార్​ ఎడారి.. ఒకప్పుడు సస్యశ్యామల ప్రాంతమా? అక్కడ నది ప్రవహించిందా? పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు

By:  Tupaki Desk   |   23 Oct 2020 5:00 AM IST
థార్​ ఎడారి.. ఒకప్పుడు సస్యశ్యామల ప్రాంతమా? అక్కడ నది ప్రవహించిందా?  పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు
X
రాజస్థాన్​లోని ఎడారి ప్రాంతమైన థార్​ ఎడారిపై ఇప్పుడు ఆసక్తికరమైన పరిశోధనలు సాగుతున్నాయి. ఈ థార్​ ఎడారిలో ఓ నది ప్రవహించేందట. శాస్త్రవేత్తలు ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా కనిపెట్టారు. సుమారు ల‌క్షా డెభ్బై రెండు వేల క్రితం రాజస్థాన్ లోని బిక‌నీర్ సమీపంలో ఉన్న సెంట్రల్ థార్ ఎడారి ఓ న‌ది ప్రవహించేదట. అయితే ఈ ప్రాంతంలో గొప్ప నాగరికత కూడా ఉండి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. థార్​ ఎడారిపై జర్మనీకి చెందిన ది మాక్స్ ప్లాంక్ ఇన్​స్టిట్యూట్ ఫర్ సైన్స్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ, తమిళనాడులోని అన్నా విశ్వవిద్యాలయం, ఐఐఎస్ఈఆర్ కోల్‌కతాకు చెందిన చరిత్రకారులు పరిశోధనలు చేశారు. వీరి ప‌రిశోధ‌న వివ‌రాలు క్వాటర్నరీ సైన్స్ రివ్యూస్ జర్నల్‌లో ప్రచురించారు.

ఈ పరిశోధనలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. రాతియుగం నాటి మాన‌వులు ప్ర‌స్తుతం మనం ఎదుర్కొంటున్న దానికంటే భిన్నమైన థార్ ఎడారి ప్రకృతిలో నివసించార‌ని అధ్య‌య‌నం తెలుపుతోంది. కనుమ‌రుగైన న‌ది స‌మీప ఆధునిక న‌దికి 200 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌ట్లుగా పరిశోధనలో తేలింది. నల్ గ్రామ సమీపంలోని క్వారీ నుంచి విడుదలైన ఇసుక, కంకరలను ఈ బృందం అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో వీరికి నది ఆనవాళ్లు కనిపించాయి. నది ఇసుకలోని క్వార్ట్జ్ గ్రేయిన్స్ ఎప్పుడు ఖ‌న‌నం అయ్యాయో తెలుసుకునేందుకు పరిశోధకులు ‘లుమినిసెన్స్ డేటింగ్’ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. దీన్ని ఉప‌యోగించి న‌ది వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన ఆధారాల‌ను గుర్తించారు.

ఉపగ్రహ ఛాయాచిత్రాల అధ్య‌య‌నం థార్ ఎడారి గుండా ప్ర‌వ‌హించిన నది మార్గాల నెట్‌వర్క్‌ను చూపించిన‌ట్లు పరిశోధకులు తెలిపారు. థార్ ఎడారికి గొప్ప చరిత్ర ఉందని ప‌రిశోధ‌కులు తెలిపారు. రాతియుగం నాటి మనుషులు అప్పట్లో ఎలా మనుగడ సాధించేవారో తాము అధ్యయనం చేస్తున్నట్టు ది మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫ‌ర్ సైన్స్ ఆఫ్ హ్యూమన్ శాస్ర్త‌వేత్త‌ జింబోబ్ బ్లింక్‌హార్న్ పేర్కొన్నారు. గతంలో నదులు ఎక్కడెక్కడ ప్రవహించేవో.. కాలక్రమేనా అవి ఎలా అంతరించాయో తెలుసుకొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఈ పరిశోధనలకు చారిత్రక ఆధారాలు చాలా తక్కువగా దొరుకుతున్నాయి.