Begin typing your search above and press return to search.

థాంక్యూ మోడీజీ చాలెంజ్: కసి తీర్చుకుంటున్న ప్రజలు

By:  Tupaki Desk   |   19 July 2021 11:30 AM GMT
థాంక్యూ మోడీజీ చాలెంజ్: కసి తీర్చుకుంటున్న ప్రజలు
X
ప్రజలిప్పుడు రగిలిపోతున్నారు. కరోనాతో ఆదాయం లేక అష్టకష్టాలు పడుతున్న వేళ కేంద్రంలోని మోడీ సర్కార్ కర్రు కాల్చి వాత పెడుతున్న చందంగా పెట్రోల్ డీజిల్ ధరలను భారీగా పెంచి రూ.100 దాటుతున్నా ఆపకుండా దోచేస్తున్న తీరుకు రగిలిపోతున్నారు. అందుకే ఇప్పుడు ప్రతి పెట్రోల్ బంక్ వద్దనున్న మోడీ ఫొటోకు దండాలు పెడుతూ ట్విట్టర్ లో షేర్ చేస్తూ ‘థాంక్యూ మోడీజీ చాలెంజ్’ అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇదో పెద్ద ఉద్యమం లాగానే ట్విట్టర్ లో సాగుతోంది.

పెట్రోల్ డీజిల్ ధరలు సెంచరీ దాటేసి ఇంకా పరుగులు పెడుతున్నాయి. అందుకే పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చిన వాహనదారులు అంతా ఇప్పుడు మోడీ ఫొటోకు దండం పెడుతూ ‘థాంక్యూ మోడీజీ’ అంటూ గొంతెత్తుతున్నారు. వ్యంగ్యంగా చేస్తున్న ఈ నిరసన ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ‘థాంక్యూ మోడీజీ చాలెంజ్’ హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. మోడీ పరువుతీసేలా కొందరైతే బట్టలన్నీ విప్పేసి వాహనాలపై నిలబడి మోడీకి దండం పెడుతున్నారు. ఇంకొందరు తమ క్రియేటివిటీతో ఫొటోలు జోడించి బీజేపీ ప్రభుత్వంపై హోరెత్తిస్తున్నారు.

గతంలో పెట్రోల్ ధరలు పెంచిన యూపీఏ కాంగ్రెస్ పై మోడీ చేసిన ట్వీట్లను బయటకు తీసి ఇప్పుడు కొందరు నెటిజన్లు కడిగేస్తున్నారు. పెట్రో ధరలపై సహనం నశించిన ప్రజలంతా ఇప్పుడు ఇలా దండం పెడుతూ తమ అసహనాన్ని మోడీకి తగిలేలా హోరెత్తిస్తున్నారు.

ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సైతం ఈ ట్రెండింగ్ ను అక్షరాల అందిపుచ్చుకుంటోంది. ఈ ట్రెండ్ ను వాడుకుంటూ బీజేపీని ఇరుకునపెడుతోంది. ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై చర్చకు ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు పట్టుబడుతూ బీజేపీని టార్గెట్ చేస్తున్నారు.

అయితే దేశ ప్రజలు చేస్తున్న ఈ ‘థాంక్యూ మోడీజీ చాలెంజ్’కు బీజేపీ నేతలు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే పెట్రోల్ రేట్లు దేశంలో భారీగా పెరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలుకూడా పెంచుతున్నాయని బీజేపీ మద్దతుదారులు అనడం తప్పితే ఏం చేయలేకపోతున్నారు.

ప్రస్తుతం దేశంలో ముంబైలో గరిష్టంగా పెట్రోల్ లీటర్ కు రూ.107.83 రూపాయలు , డీజిల్ రూ.97.45 రూపాయలు ఉంది. హైదరాబాద్ లో రూ.105.52గా ఉంది. ఈ పెట్రో సెగ ముందు ముందు బీజేపీకి గట్టిగానే సెగ తగిలేలా కనిపిస్తోంది.