Begin typing your search above and press return to search.

కేసీఆర్ గ‌ల్లా ప‌ట్టుకొని అడ‌గాల‌ట‌

By:  Tupaki Desk   |   1 Jan 2017 6:32 AM GMT
కేసీఆర్ గ‌ల్లా ప‌ట్టుకొని అడ‌గాల‌ట‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మ‌రోమారు నిప్పులు చెరిగారు. మహాజన పాదయాత్రలో భాగంగా క‌రీంనగర్‌ జిల్లాలో సభలు నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాయమాటలతో అధికారంలోకి వ‌చ్చి మాట తప్పిన కేసీఆర్‌ ను గ‌ల్లా ప‌ట్టుకొని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకు తీరని ద్రోహం చేసిన కేసీఆర్‌ చరిత్ర చెత్తకుప్పలోకే వెలుతుందని వీర‌భ‌ద్రం వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ విడతలుగా చెల్లించడంతో వడ్డీలకూ సరిపోవడం లేదన్నారు. సీఎం కేసీఆర్‌ చెబుతున్నట్టు చెరువు కట్టల మీద రైతులు దావత్‌ చేసుకోవడం లేదన్నారు. మెదక్‌ జిల్లా తిమ్మాపూర్‌ లో అప్పుల పాలైన రైతు కుటుంబసభ్యులంతా చికెన్‌ లో పురుగుల మందు కలుపుకుని తిని ఇద్దరు మృతి చెందిన ఘటన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తరువాతే రాష్ట్రంలో రెండు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితిని బేరీజు వేసుకోవచ్చని వివరించారు. మార్కెట్లలో గన్నీ సంచులు లేక ధాన్యం కొనుగోలు చేయడం లేదని, గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని వీర‌భ‌ధ్రం అన్నారు.

ముఖ్యమంత్రి దత్తత గ్రామాల్లో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల ఖర్చు కంటే ఆర్భాటం కోసం చేసిన ప్రకటనల ఖర్చే ఎక్కువ అని త‌మ్మినేని వీర‌భ‌ద్రం ఎద్దేవా చేశారు. రెండు గ్రామాల్లో నిర్మించి రాష్ట్రమంతా ఇండ్లు నిర్మించినట్టు చెప్పుకుంటున్నారని పైగా ఇందిరమ్మ ఇండ్లపై విమర్శ చేసిన ఆయన ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వకపోగా గిరిజనుల భూములను లాక్కునే కుట్ర సాగుతున్నదని అన్నారు. కమ్యూనిస్టుల ఒత్తిడితో వచ్చిన 1/70 చట్టాన్ని నీరుగార్చడం తగదని హితవు చెప్పారు. గిరిజనులకు అటవీ మీద హక్కులేదనే హక్కు ముఖ్యమంత్రికే లేదని వీర‌భ‌ద్రం తెలిపారు. రాష్ట్రంలో గిరిజనుల సంఖ్య 10శాతం ఉన్నా.. గతంలోని 6శాతాన్నే అమలు చేస్తున్నట్టు తెలిపారు. బీసీలకూ సబ్‌ ప్లాన్‌ చట్టం రావాలని, ముస్లిములకు 12శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని త‌మ్మినేని డిమాండ్‌ చేశారు. 93శాతం ఉన్న బహుజనులకు న్యాయం చేయకుండా ఏ విధంగా రాష్ట్రాభివృద్ధి సాధ్యం అవుతుందో చెప్పాలని ఆయ‌న‌ ప్రశ్నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/