Begin typing your search above and press return to search.

బాబు చేసిందే కేసీఆర్ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   25 Dec 2016 6:29 AM GMT
బాబు చేసిందే కేసీఆర్ చేస్తున్నారా?
X
తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు నారా చంద్ర‌బాబు నాయుడు - క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు త‌మ త‌మ రాష్ట్రాల్లో ప‌రిపాల‌నతో ఒక‌రికొక‌కు పోటీ ప‌డ్డ‌ట్లే ప్ర‌జా ఉద్య‌మాల విష‌యంలోనూ అదే ట్రెండ్ కొన‌సాగిస్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. త‌న పాద‌యాత్రకు ఏపీ సీఎం చంద్ర‌బాబు అడ్డంకులు సృష్టిస్తున్నార‌ని కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఇటీవ‌ల ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌కు చెప్పేందుకు అనుమ‌తులు కావాల అని ముద్ర‌గ‌డ ఫైర్ అయ్యారు. ఇపుడు అదే రీతిలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిప‌డుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా ఉద్యమాలకు పర్మిషన్లు కావాలా..? అని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆయ‌న‌ ప్రశ్నించారు.

సీపీఎం ఆధ్వ‌ర్యంలో సాగుతున్న‌ మహాజన పాదయాత్ర పెద్దపల్లి జిల్లాకు చేరింది. అయితే ఈ క్ర‌మంలో త‌మ‌కు ఎదురైన ఇబ్బందిని వీర‌భద్రం వివ‌రించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అనుమతి లేదని స్థానిక ఎస్‌ ఐ అడ్డుకునే ప్రయత్నం చేశారని పేర్కొంటూ పక్కనే కలెక్టరేట్‌ లో ఉన్న కలెక్టర్‌ కు సౌండ్‌ వస్తుందని చెప్పి - పర్మిషన్‌ లేదనే కారణంతో మమ్ముల్ని అడ్డుకోచూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తెలంగాణలోని పాలకులు-అధికారుల వైఖరికి నిదర్శనమని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా - ఎక్కడైనా ప్రజా ఉద్యమాలు చేయొచ్చని, అందుకు పర్మిషన్లు కావాలా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల హామీలపై ప్రశ్నించిన నాయకులను - పార్టీలను - ప్రజాసంఘాలను అణచివేయాలని చూస్తున్నారని తమ్మినేని వీర‌భ‌ద్రం ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడితే ఎన్‌కౌంటర్లు ఉండవని చెప్పిన కేసీఆర్‌ అధికారంలోకి రాగానే ఇద్దరు మావోయిస్టులను ఎన్‌కౌంటర్‌ చేయించారని అన్నారు. మావోయిస్టుల సిద్ధాంతానికి తమపార్టీ వ్యతిరేకమైనా, 'సామాజిక న్యాయం- సమగ్రాభివృద్ధి' కోసం కమ్యూనిస్టులంతా కలిసిరావాలని వీర‌భ‌ద్రం పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత ఊళ్లో 500 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల గృహప్రవేశాలు చేశారని, రాష్ట్రంలోని మిగతా గ్రామాల పరిస్థితి ఏంటని త‌మ్మినేని వీర‌భ‌ద్రం ప్రశ్నించారు. మరో పక్క మంత్రులు, ఎమ్మెల్యేలు దీన్నే రాష్ట్రమంతటా ఇచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పేపర్లల్లో ప్రకటనలకు ఖర్చు చేసే డబ్బులతోనే కొన్ని గ్రామాల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌లు నిర్మించొచ్చని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం అన్ని గ్రామాల్లో డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. తమ్మినేనికి - పాదయాత్ర బృందం నాయకులకు తెలంగాణ ప్రజాఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ ఆధ్వర్యంలో పౌరహక్కుల కార్యకర్తలు సంఘీభావం తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/