Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ తిక్క పనులు చేస్తున్నారంట!

By:  Tupaki Desk   |   11 July 2015 10:33 AM GMT
కేసీఆర్‌ తిక్క పనులు చేస్తున్నారంట!
X
సీఎంగా పదమూడు నెలలుగా వ్యవహరిస్తున్నప్పటికీ తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కమ్యూనిస్టు నేతలు పెద్దగా విమర్శించింది లేదు. ప్రతి చిన్న విషయానికి విరుచుకుపడే కమ్యూనిస్టు నేతలు కాస్తంత సంయమనం వ్యవహరించినట్లుగా కనిపిస్తోంది. ఇంతకాలం పెద్దగా నోరు విప్పని కమ్యూనిస్టు నేతలు.. తాజాగా మాత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు.

తాజాగా పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘీభావంగా వెళ్లిన తెలంగాణ సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తిక్క పనులు చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

చేతిలో చీపురు పట్టుకొని ఫోటోలకు ఫోజు ఇస్తేనే సరిపోదని.. కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాల కారణంగానే ఈ రోజు హైదరాబాద్‌ చెత్తతో కంపు కొడుతుందని మండిపడ్డారు. సమ్మె చేస్తున్న కార్మికుల్ని మరింత ఉత్సాహపరిచేందుకు కాస్త మసాలా దట్టించి మరీ మాట్లాడిన తమ్మినేని.. కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం చూసినప్పుడు.. రానున్న రోజుల్లో కేసీఆర్‌పై విమర్శలతో విరుచుకుపడేందుకు కత్తులు నూరుతున్నట్లే కనిపిస్తోంది.