Begin typing your search above and press return to search.

కొత్త ప్రేమ:రామోజీ అంటే మాకూ అభిమానమే

By:  Tupaki Desk   |   26 Sept 2015 10:25 AM IST
కొత్త ప్రేమ:రామోజీ అంటే మాకూ అభిమానమే
X
వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు కొత్త ప్రేమ పుట్టుకొచ్చింది. నిన్నటి వరకూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేయటం మొదలు.. తమ మీడియా సంస్థలో రాజగురువుగా.. రాజకోటలో ఏదేదో జరుగుతుందని రాసేయటమే కాదు.. క్యారికేచర్ లతో పెద్ద పెద్ద ఫోటోలు ప్రచురించిన రామోజీ సంస్థల అధినేత రామోజీరావుపై విపరీతమైన ప్రేమాభిమానాల్ని ప్రదర్శిస్తోంది. పార్టీ అధినేత జగన్.. రామోజీ ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా భేటీ అయిన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతల వాయిస్ మొత్తంగా మారిపోయింది.

రామోజీరావుతో జగన్ భేటీని వారు కన్ఫర్మ్ చేస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉండటమే కాదు.. కొత్త చర్చకు తావిస్తున్నాయి. రామోజీ చంద్రబాబు ఒక్కరి సొత్తు మాత్రమే కాదని.. ఆయనంటే తమకూ అభిమానమే అంటూ కొత్త ప్రేమను ప్రదర్శిస్తున్నారు.

‘‘రామోజీరావుగారంటే మాకూ అభిమానమే. పెద్దాయన. గౌరవించదగిన వ్యక్తి. అదేముంది టీవీ 9 రవిప్రకాశ్ ను కలుస్తారు. తప్పేముంది. ఇక్కడున్న వారిలో ఆయనకు చాలామంది మంచి స్నేహితులు’’ అంటూ చెప్పుకొచ్చారు. రామోజీ అంత పెద్దాయన.. గౌరవించదగిన వ్యక్తి అయితే మరింతకాలం ఆయన మీద చేసిన వ్యాఖ్యలు.. రాసిన రాతలు.. వేసిన బొమ్మల మాటేమిటి? అప్పుడెక్కడకు వెళ్లిందో గౌరవం..?

ఇదిలా ఉంటే.. టీవీ9 ప్రకాశ్ ప్రస్తావన తేవటం ద్వారా.. ఆయనతో కూడా తమకు సరైన సంబందాలు లేవన్న విషయాన్ని తమ్మినేని చెప్పకనే చెప్పేసినట్లైయింది. రామోజీతో అంటే.. జగన్ నాయిన కాడి నుంచి వచ్చిందనుకుందాం? మరి.. టీవీ9 రవిప్రకాశ్ తో లొల్లి ఏంది? అది కూడా చెప్పేసి పుణ్యం కట్టుకుంటే బాగుంటుంది కదా? ఇంతమందిని కలుస్తున్నారు.. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను కూడా జగన్ బాబు కలుస్తారా తమ్మినేని అంటూ అడుగుతున్న ప్రశ్నలకు ఆయన సమాధానం చెబితే బాగుంటుందేమో.