Begin typing your search above and press return to search.

కుక్కలకు ట్రైనింగ్ ఇస్తూ.. ఆ దేశ యువరాణికి గుండెపోటు

By:  Tupaki Desk   |   16 Dec 2022 4:34 AM GMT
కుక్కలకు ట్రైనింగ్ ఇస్తూ.. ఆ దేశ యువరాణికి గుండెపోటు
X
డిజిటల్ యుగంలోకి అడుగు పెట్టి చాలాకాలమే అయినా ఇప్పటికి ప్రపంచంలో రాజరికాలు.. రాజులు.. రాణులు చాలానే దేశాల్లో కనిపిస్తుంటారు. ఆ కోవలోకే చెందుతారు థాయ్ లాండ్ రాజరిక కుటుంబం. థాయిలాండ్ రాజు మహా వజిరలాంగ్ కార్న్ మొదటి భార్య సోమ్ సావాలి కుమార్తె బజ్రకిటియభా అప్పుడప్పుడు వార్తల్లో దర్శనమిస్తుంటారు. ఆమె వ్యవహారశైలి మిగిలిన వారికి కాస్తంత భిన్నంగా ఉండటమే. భవిష్యత్తులో ఆమె రాజుగారి వారసురాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్న ప్రచారం ఉంది.

44 ఏళ్ల వయసులో ఉన్న ఆమె అనూహ్యంగా అనారోగ్యానికి గురి కావటం గమనార్హం. తాజాగా పెంపుడు కుక్కలకు ట్రైనింగ్ ఇస్తున్న వేళ ఆమె అకస్మాత్తుగా కుప్పకూలారు. తీవ్రమైన గుండెపోటుకు గురైనట్లుగా చెబుతున్నారు. ఆ వెంటనే స్పందించినే సిబ్ంది ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి.. ఆ వెంటనే హెలికాఫ్టర్ లో థాయ్ లాండ్ లోని మరో ఆసుపత్రికి తరలించారు.

థాయ్ యువరాణి ప్రత్యేకత ఏమంటే.. ఆమె అమెరికాకు చెందిన రెండు ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి న్యాయ శాస్త్రంలో పట్టాను పొందారు. అంతేకాదు.. థాయ్ లాండ్ దేశ న్యాయ సంస్కరణల్లో ఆమె కీలక భూమిక పోషించినట్లు చెబుతారు. అంతేకాదు 2012-14లో ఆమె ఆస్ట్రేలియాకు థాయ్ రాయబారిగా వ్యవహరించారు. యువరాణి అయినప్పటికీ చాలా చురుగ్గా ఉంటూ పాలనా వ్యవహారాల్లో మార్పుల దిశగా ఆమె పని చేస్తుంటారు.

రాబోయే రోజుల్లో కాబోయే రాజుగా ఆమెకు పేరుంది. అలాంటి ఆమె.. మధ్య వయసులో ఇలాంటి తీవ్రమైన అనారోగ్యానికి గురి కావటం ఆందోళన కలిగిస్తోంది. ఆమె పరిస్థితి మెరుగు పడిందని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని కొందరు చెబుతుంటే.. మరికొందరు మాత్రం క్రిటికల్ గా ఉందని చెబుతున్నారు.

ఆమెకు సీపీఆర్ చేసినా స్పందించలేదని.. ఎక్మో ద్వారా చికిత్సను అందిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే.. అధికారికంగా ఆమెకు సంబంధించిన హెల్త్ బులిటెన్ విడుదలైతే మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. యువరాణి ఆరోగ్య పరిస్థితిపై థాయ్ ప్రజలు ఆందోళనలో ఉన్నట్లు చెబుతున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.