Begin typing your search above and press return to search.

ప్రశ్నలు అడుగుతున్న జర్నలిస్టుల ముఖాలపై శానిటైజర్ కొట్టిన ఆ దేశ ప్రధాని

By:  Tupaki Desk   |   13 March 2021 10:54 AM IST
ప్రశ్నలు అడుగుతున్న జర్నలిస్టుల ముఖాలపై శానిటైజర్ కొట్టిన ఆ దేశ ప్రధాని
X
పవర్ అంతా పోగు పోసినట్లు ఉండే తన దగ్గర ప్రశ్నలు అడగటమా? ప్రశ్నించటమా? అని కొద్దిమంది తెగ ఫీలైపోతుంటారు. అలాంటి వారు చేసే పనులు వారి ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేసేలా చేస్తుంది. జర్నలిస్టులపై తీవ్రమైన చిరాకును ప్రదర్శించే పాలకులకు ప్రపంచంలో కొదవ లేదు. ఆ వరుసలో మొదటి ఐదు స్థానాల్లో ఒకరుగా నిలుస్తారు థాయ్ లాండ్ ప్రధానమంత్రి ప్రయూత్ చాన్.

సైనిక పాలకుడైన ఆయన.. బలవంతంగా తన చేతుల్లోకి రాజ్యాధికారాన్నితీసుకున్నారు. దీన్ని ప్రశ్నిస్తూ ప్రజలతో కలిసి ఆందోళన నిర్వహించిన మంత్రుల్ని ఏకంగా జైలుకు పంపేశారు. జర్నలిస్టులు కనిపించినంతనే ముఖం మాడిపోయే ఆ దేశ ప్రధానికి.. ప్రశ్నలు అడగటాన్ని అస్సలు తట్టుకోలేరు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన చేసిన పని మండిపోయేలా చేయటమే కాదు.. ఆయన తీరును పెద్ద ఎత్తున తప్పు పడుతున్నారు. ఇంతకీ జరిగిందేమంటే..

బ్యాంకాక్ లో ఈ నెల 10న ఒక ప్రెస్ మీట్ జరిగింది. దీనికి దేశ ప్రధానిహాజరయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ప్రశ్నల మీద ప్రశ్నల్ని సందించారు. ఏడేళ్ల క్రితం తన పాలన షురూ అయ్యాక జరిగిన ఆందోళనలో పాల్గొన్న ముగ్గురు మంత్రుల పదవుల్ని పీకేశారు. ఆ పదవుల్ని భర్తీ ఎప్పుడు చేస్తారంటూ పాత్రికేయులు అడిగిన ప్రశ్న ఆయనకు ఒళ్లు మండేలా చేసింది. అప్పటివరకు ప్రెస్ మీట్ లో కూర్చున్న ఆయన.. ఒక్కసారి చిరాకు పడిపోతూ లేవటమే కాదు.. మీడియా ప్రతినిధుల ముందుకు వచ్చినట్లే వచ్చి.. తన చేతిలోని శానిటైజర్ ను వారి ముఖాల మీదనే స్ప్రే చేశారు.

ప్రధాని ప్రదర్శించిన ఈ తీరుపై జర్నలిస్టుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైనా.. కామ్ గా తమ చేతిలోని మైబైళ్లకు పని చెప్పారు. ఆయన తీరును కళ్లకు కట్టేలా సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ఇప్పుడా వీడియో తెగ వైరల్ గా మారింది. జర్నలిస్టుల పట్ల ప్రధాని ప్రయూత్ అనుచితంగా ప్రవర్తించటం ఇదే మొదటిసారి కాదు. గతంలో చానల్ సిబ్బంది మీద అరటి తొక్కను విసరటం.. మరో సందర్భంలో ఒక రిపోర్టర్ తల మీద కొట్టి అతడి చెవిని లాగటం.. ఇంకో సందర్భంలో భారీ సైజ్ కటౌట్ ఏర్పాటు చేసి.. దాన్ని ప్రశ్నలు అడగాలంటూ అధికార బలుపును ప్రదర్శించారు. అయ్యగారి తీరు ఎలా ఉంటుందో వీడియోను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.