Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో కుక్క పై సటైర్లకు జైలు శిక్ష

By:  Tupaki Desk   |   16 Dec 2015 9:51 AM IST
సోషల్ మీడియాలో కుక్క పై సటైర్లకు జైలు శిక్ష
X
కొన్ని దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయన్నది తాజా ఉదంతం చూస్తే ఇట్టే అర్థమవుతుంది. మామూలు కుక్కే కదా అని ఆ దేశంలోని ఆ కుక్క గురించి మాట్లాడితే అడ్డంగా బుక్ కావటం ఖాయం. ఎందుకంటే.. అది థాయ్ లాండ్ రాజుగారి పెంపుడు కుక్క మరి. పేరుకు కుక్కే అయినా.. రాజుగారి మనసు దోచుకోవటంతో.. దాన్ని పల్లెత్తు మాట అన్నా.. జైల్లోకి తోసేయటమే కాదు.. భారీ శిక్షలు విధిస్తారు.

ఈ మధ్యనే ఆ దేశ రాజు భుమిబోల్ అల్లారు ముద్దుగా పెంచుకునే ‘‘థనాకోర్న్’’ (కుక్కగారి పేరు) ను ‘‘సిరిపాయిబూన్’’ అనే వ్యక్తి సోషల్ మీడియాలో సటైర్లు వేశారు.అంతే.. థాయ్ లాండ్ మిలటరీ సర్కారుకు కోపం వచ్చేసింది. ఈ రోజు రాజుగారి కుక్క మీద సటైర్లు వేసినోడు.. రేపొద్దున్న రాజుగారి మీదనే జోకులు వేస్తే.. రాజుగారి హుందాతనానికి ఎంత భంగం అనుకున్నారేమో కానీ.. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

కుక్కగారి మీద సటైర్లు వేసిన మహా నేరానికి ఏకంగా ‘దేశ ద్రోహం’ కేసు నమోదు చేశారు. మరి.. అంత పాపం చేసిన వ్యక్తిని కోర్టులు మాత్రం ఊరుకుంటాయా? వెంటనే.. సదరు వ్యక్తికి 37 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ మిలటరీ కోర్టు శిక్ష విధించింది. కొసమెరుపేమంటే.. ఈ వ్యవహారం మొత్తం రాజుగారి కుక్క చుట్టూ తిరిగినా.. కేసు.. శిక్ష విషయాల్లో మాత్రం ‘‘కుక్క’’ ప్రస్తావన తీసుకురాలేదు. ఎంతైనా రాజుగారి కుక్క కదా. దాని డిగ్నిటీకి ఇబ్బంది కలగకూడదనుకున్నారేమో.