Begin typing your search above and press return to search.

థాయ్ గుహ‌..ఇప్పుడో మ్యూజియం

By:  Tupaki Desk   |   12 July 2018 11:33 AM GMT
థాయ్ గుహ‌..ఇప్పుడో మ్యూజియం
X
12 మంది ఫుట్‌ బాల్ ప్లేయర్స్ - వాళ్ల కోచ్ చిక్కుకుపోవడం ద్వారా వార్త‌ల్లో నిల‌వ‌డమే కాకుండా..ప్ర‌పంచం చూపును త‌న‌వైపు తిప్పుకున్న థాయ్ గుహ మ‌రోమారు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌నుంది. థాయ్ గుహ‌లో చిక్కుకున్న బాలురు - వారి కోచ్ సురక్షితంగా బయటకు వస్తారా లేదా అని ఆసక్తిగా ఎదురుచూసింది. చివరికి అత్యంత అరుదైన రెస్క్యూ ఆపరేషన్‌ తో వాళ్లందరినీ బయటకు తీసుకురాగలిగారు. ఈ మూడు వారాల్లో ఆ థాయ్ గుహ గురించి రకరకాల కథనాలు వచ్చాయి. తాజాగా ఈ గుహను మ్యూజియంగా మలచబోతున్నారన్న వార్త మరింత ఆసక్తి రేపుతోంది.

మూడు వారాలుగా ప్రపంచమంతటిని ఉత్కంఠ‌లో ప‌డేసిన థాయ్ గుహ లువాంగ్‌ లో జరిగిన రెస్క్యూ ఆపరేషన్ గురించి వివరిస్తూ మ్యూజియంలో ప్రత్యేకంగా షో ఏర్పాటు చేయనున్నారు. థాయ్‌ లాండ్ పర్యాటక ప్రాంతాల్లో ఈ గుహ ప్రత్యేకంగా నిలవనుందని బీబీసీలో వచ్చిన ఆ కథనం వివరించింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ తీరును తెరకెక్కించడానికి రెండు కంపెనీలు పోటీ పడుతున్నాయి. థాయ్‌ లాండ్‌ లో అతి పెద్ద గుహల్లో ఈ థామ్ లువాంగ్ కూడా ఒకటి. అయితే దీనిని టూరిజం స్పాట్‌ గా మార్చే ముందు అన్ని రక్షణ చర్యలు చేపట్టనున్నట్లు థాయ్ ప్రధాని ప్రయూత్ చాన్ ఓచా స్పష్టం చేశారు. మ‌రోవైపు గుహ నుంచి బయటకు వచ్చినవాళ్లంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్లంతా ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక థాయ్ నేవీ సీల్స్ ఈ ఆపరేషన్‌ కు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. అందులో డైవర్లు ఎలా ఆ టీమ్‌ ను బయటకు తీసుకొచ్చారో చూపించింది.