Begin typing your search above and press return to search.

అంతాసేఫ్‌...ఆప‌రేష‌న్ థాయ్ స‌మాప్తం

By:  Tupaki Desk   |   10 July 2018 2:03 PM GMT
అంతాసేఫ్‌...ఆప‌రేష‌న్ థాయ్ స‌మాప్తం
X

ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠతో చూసిన సంఘ‌ట‌న‌కు తెరపడింది. కోట్లాది మందిని చూపును త‌న‌వైపు తిప్పుకున్న థాయ్‌ లాండ్ చిన్నారుల ఘటనకు శుభం కార్డు ప‌డింది. గుహలో చిక్కుకున్న ఫుట్‌ బాల్ టీం కోచ్ సహా 12 మంది పిల్లలను 19 మంది డైవర్లతో కూడిన రెస్క్యూ టీం అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 18 రోజులుగా గుహలో బిక్కుబిక్కుమంటూ గడిపిన చిన్నారులను ఒక్కొక్కరిగా సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. తొలుత ఆదివారం (జులై 8న)సహాయక చర్యలు ప్రారంభించిన సిబ్బంది నలుగురిని కాపాడగా..తర్వాత రోజుల మరో నలుగురిని కాపాడింది. మూడో రోజు మిగిలిన ఐదుగురిని సురక్షితంగా కాపాడింది.

ఈ సంఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే... జూన్ 23న గుహలోకి వెళ్లిన ఫుట్‌ బాల్ టీం అక్కడే చిక్కుకుని పోయిన విషయం తెలిసిందే. వీరంతా 11 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న వారే. 12 మంది పిల్లలు 25 ఏళ్ల వయసున్న వాళ్ల‌ కోచ్‌ తో కలిసి వాతావరణ పరిస్థితులు సాధారణంగా ఉన్న సమయంలో వాళ్లు ఆ గుహలోకి వెళ్లారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. దీంతో బయటకు వచ్చే మార్గం మూసుకుపోయింది. అప్పటికే వాళ్లు 4 కిలోమీటర్ల మేర లోనికి వెళ్లిపోయారు. అక్కడక్కడా బయటపడటానికి కొన్ని మార్గాలు ఉన్నా.. వరద కారణంగా అవన్నీ బురదతో కూరుకుపోయాయి. ఇదే స‌మ‌యంలో వారికోసం త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న మొద‌లైంది. వారి ఆవేద‌న‌ను వైర‌ల్ అవ‌డంతో...ఆ దేశ ప్ర‌భుత్వం స్పందించింది. ఆ చిన్నారుల రెస్క్యూ ఆపరేషన్‌ లో భాగంగా వచ్చిన ఇద్దరు బ్రిటిష్ డైవర్లు పట్టాయా బీచ్ సమీపంలో వాళ్లు ఉండొచ్చని భావించి అక్కడి నుంచి లోనికి వెళ్లి వారిని గుహలో గుర్తించారు. వరద నీటికి దూరంగా గుహలో ఉన్న ఓ ఎత్తయిన ప్రాంతంలో ఆ చిన్నారులు కూర్చున్నట్లు గుర్తించారు. అనంత‌రం రెస్క్యూ ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టారు.

ఇదిలాఉండ‌గా...ప్ర‌పంచంలో ఇలాంటి రెస్క్యూ ఆప‌రేష‌న్ ఇదే మొద‌టిసారి. ముఖానికి ఆక్సిజన్ మాస్క్‌ లు వేసుకొని - నీటి అడుగున ఈదుకుంటూ రావడం బాలలకు ఇదే ప్ర‌థ‌మం. బ్రిటిష్ గజ ఈతగాళ్ల సంరక్షణలో ఇప్పటివరకు ఎనిమిది మంది బాలలు అత్యంత ప్రమాదకరమైన మార్గంలో ప్రాణాలతో బయటపడ్డారు. రెండు వారాల అనంతరం సూర్యకాంతిని చూసిన బాలలు వెలుగుకు అలవాటు పడేందుకు కనురెప్పలు మూసి తెరుస్తున్న సమయంలో వారిని రక్షించిన బ్రిటిష్ డైవర్లు గట్టిగా ఆలింగనం చేసుకోవడం చూపరులను భావోద్వేగానికి గురిచేసింది. గుహ నుంచి ఆదివారం మొట్టమొదటగా 13 ఏండ్ల మాంఖోల్ బూన్‌పియాం అలియాస్ మార్క్‌ ను తీసుకొచ్చామని థాయ్ అంతరంగిక శాఖ మంత్రి అనుపోంగ్ పావోజిండా బ్యాంకాక్‌ లో చెప్పారు. రెండో బాలుని పేరు సూతం అని, అతడిని నోట్ అని కూడా పిలుస్తారని అన్నారు. మూడో బాలుడు 14 ఏండ్ల నట్టావూట్ తకమ్‌ సాయ్ అని, ఇతడు ఆస్థమా బాధితుడు అని చెప్పారు. అతని తల్లిదండ్రులు ఇప్పటికే ఒక కుమార్తెను క్యాన్సర్ కారణంగా కోల్పోయారని అన్నారు. ఇక నాలుగోవాడు 15 ఏండ్ల పీపట్ బొద్ధు అని తెలిపారు. ఇతడు ఫుట్‌ బాల్ జట్టులో సభ్యుడు కాదని, అయితే తన స్నేహితుడైన గోల్‌ కీపర్ వెంట గుహలోపలికి వెళ్లాడని చెప్పారు.