Begin typing your search above and press return to search.

మూడు రాజధానులు మంచి నిర్ణయం ...స్వాగతించిన కర్నూలు ఎంపీ

By:  Tupaki Desk   |   18 Dec 2019 6:18 AM GMT
మూడు రాజధానులు మంచి నిర్ణయం ...స్వాగతించిన కర్నూలు ఎంపీ
X
ఏపీ కి మూడు రాజధానులు..ఇప్పుడు ఇదే అంశం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద చర్చనీయంశమైంది. అసెంబ్లీ లో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రజలంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సీఎం జగన్‌ పై వైసీపీ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు టీడీపీ మాత్రం వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒక్క రాజధానినే కట్టలేకపోతున్నామని.. అలాంటప్పుడు మూడు రాజధానులను ఎలా కడతారని చంద్రబాబు మండిపడ్డారు.

అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదు అని , వికేంద్రీకరణ జరగాలని అందుకే ఏపీకి మూడు రాజధానులు అవసరముందని సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రికా లాంటి దేశాలలో మూడు రాజధానులు ఉన్నాయని, మనం కూడా మారాలి అని, మన రాష్ట్రానికి కూడా మూడు రాజధానులు రావచ్చు అని సీఎం చెప్పారు. నిపుణుల కమిటీ నివేదిక అందిన వెంటనే రాజధాని పై నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్ రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని అయన ప్రకటించారు.

సీఎం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలను ముఖ్యంగా ఎంతో కాలంగా రాయలసీమ కోసం పోరాటం సాగిస్తున్న బిజెపి ఎంపీ టీజి వెంకటేష్ స్వాగతించారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల టీజీ వెంకటేష్ సంతోషం వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం జగన్ చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయని , అయితే కర్నూలులో హైకోర్టు ఒక్కటే కాకుండా అసెంబ్లీ, సచివాలయం కూడా ఉంటే బాగుంటుంది అని అన్నారు.

అలాగే ఇదే సమయంలో కర్నూలులో అసెంబ్లీ, సచివాలయం కూడా ఏర్పాటు చేస్తేనే రాజధానిగా కర్నూల్ కి అర్థం ఉంటుందని అన్నారు. రాజధానుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని ఆయన తెలిపారు. ఇక అంతే కాదు ఈ క్రమంలో జగన్‌ పై చంద్రబాబు చేసిన తుగ్లక్ వ్యాఖ్యలు సరికావన్నారు. రాజధాని వికేంద్రీకరణ చేస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్న తన అభిప్రాయాన్ని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ వ్యక్తం చేశారు.