Begin typing your search above and press return to search.

విపత్తు వేళ.. ప్రజల్ని విపరీతంగా తిట్టేసి.. రాజీనామా చేసిన మేయర్

By:  Tupaki Desk   |   19 Feb 2021 6:50 AM GMT
విపత్తు వేళ.. ప్రజల్ని విపరీతంగా తిట్టేసి.. రాజీనామా చేసిన మేయర్
X
ఏదైనా విపత్తు అనుకోని రీతిలో విరుచుకుపడితే.. తాను ప్రాతినిధ్యం వహించే ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటం రాజకీయ నేతలకు అలవాటైన విషయం. అందునా చేతిలో అధికారంలో ఉంటే.. ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడతారు. అందుకు భిన్నంగా వ్యవహరించిన మేయర్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత భారీగా మంచు తుపాను టెక్సాస్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. దీని కారణంగా ప్రజలు నానా అవస్థలకు గురవుతున్నారు. కరెంటు లేదు.. నీళ్లు లేవు.. ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే.. సమస్యల చిట్టా భారీగా ఉంది. ఇలాంటివేళ.. అపన్న హస్తం కోసం అక్కడి ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు మేయర్.

ఎముకలు కొరికే చలిలో.. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో బిక్కుబిక్కు ముంటున్న అక్కడి ప్రజలు.. ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై స్థానిక మేయర్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఏ మాత్రం ఊహకు అందని రీతిలో ఆయన క్లాస్ పీకటమే కాదు..ప్రజలంతా బిత్తరపోయేలా ఆయన మాటలు ఉన్నాయి. టెక్సాస్ రాష్ట్రంలోని కొలరాడో నగర మేయర్ గా వ్యవహరిస్తున్న టిమ్ బాయిడ్ చేసిన వ్యాఖ్యలు అక్కడి ప్రజలకు మంట పుట్టేలా చేయటమే కాదు.. విపత్తుకు మించిన మానసిక వేదనను కలిగించాయి.

సాయం కోరే వారిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఉన్నాయి. సాయం చేయటానికి మీకు ఎవరూ రుణపడి లేరు.. ఇలాంటి సమయంలో మిమ్మల్ని ఆదుకోవటం ప్రభుత్వ బాధ్యత కాదన్నారు. సాయం కోరుతున్న ప్రజల్ని చూసి విసిగిపోయానని.. విపత్తులో మునుగుతారో.. క్షేమంగా బయటపడతారో మీ ఇష్టమని తేల్చేశారు. విద్యుత్.. నీటి సరఫరా లేకపోతే మీరే ఒక మంచి పరిష్కారాన్ని కనిపెట్టాలే కానీ.. అలా ఇంట్లో కూర్చొని కంప్లైంట్లు చేస్తున్నారంటే మీరు సోమరులని అర్థమని మండిపడ్డారు.

‘ఈ గడ్డు పరిస్థితుల్లో బలవంతులు బతుకుతారు. బలహీనులు మరణిస్తారు. ఆపదలో ఉన్న వారిని మేం గుర్తించలేకపోతున్నాం. మేం చర్యలు తీసుకుంటే కొందరు ప్రభుత్వ సాయాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. కాబ్టటి ఏడుస్తూ.. చేతకాని వారిలా కూర్చొకుండా లేచి మీ కుటుంబాన్ని మీరే కాపాడుకోండి’’ అని ట్వీట్ చేశారు. ప్రజాసేవలో ఉండి ఈ రీతిలో మేయర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

తాను చేసిన పోస్టును మేయర్ టిమ్ తొలగించినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రజల నుంచి ఎదురవుతున్న తీవ్ర ఆగ్రహానికి తలవంచిన ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరి మనోభావాలు దెబ్బ తీయటం తన ఉద్దేశం కాదని.. ఎవరైనా తన వ్యాఖ్యలకు బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. తప్పులు చేయటం ఎందుకు? క్షమించమని అడగటం ఎందుకు? పదవులు పోగొట్టుకోవటం ఎందుకు?