Begin typing your search above and press return to search.

బ్రేకింగ్‌: టెక్సాస్ చ‌ర్చిలో మార‌ణ‌హోమం

By:  Tupaki Desk   |   6 Nov 2017 5:04 AM GMT
బ్రేకింగ్‌: టెక్సాస్ చ‌ర్చిలో మార‌ణ‌హోమం
X
మ‌రో మార‌ణ‌హోమానికి వేదిక‌గా నిలిచింది అమెరికాలోని ఒక ప్ర‌ముఖ మ‌హాన‌గ‌రం. ఇటీవ‌ల కాలంలో అగ్ర‌రాజ్యంలో పెద్ద ఎత్తున హింసాత్మ‌క కార్య‌క్ర‌మాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక‌ప్పుడు సేఫ్ అన్న అగ్ర‌రాజ్యంలో ఇప్పుడు ఏ క్ష‌ణంలో ఏం జ‌రుగుతుందో అర్థం కాని దుస్థితి నెల‌కొంది. మొన్న‌టికి మొన్న ఉగ్ర‌దాడితో వ‌ణికిన అమెరికాలో తాజాగా టెక్సాస్ చ‌ర్చిలో మార‌ణ‌హోమం చోటు చేసుకుంది.

టెక్సాస్ లోని సుద‌ర్లాండ్ స్ప్రింగ్స్ ఫ‌స్ట్ బాప్టిస్ట్ చ‌ర్చిలో ఉద‌యం 11.30 గంట‌ల వేళ‌లో సుమారు 50 మంది ప్రార్థ‌న‌ల్లో ఉండ‌గా.. ఒక ఆగంతుకుడు లోప‌ల‌కు ప్ర‌వేశించాడు. విచ‌క్ష‌ణ‌ర‌హితంగా కాల్పులు జ‌రిపాడు. ఈ కాల్పుల్లో రెండేళ్ల చిన్నారితో స‌హా 27 మంది అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. మ‌రో 20 మంది తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

చ‌ర్చిలో మొత్తం 50 మంది వ‌ర‌కూ ఉన్న‌ట్లు స‌మాచారం. కాల్పుల స‌మాచారం అందుకున్న పోలీసులు వెనువెంట‌నే అక్క‌డికి చేరుకున్నారు. మార‌ణ‌హోమానికి పాల్ప‌డ్డ ఆగంత‌కుడ్ని మ‌ట్టుబెట్టారు. కాల్పులు పూర్తిగా ఆగిపోయిన‌ట్లుగా చ‌ర్చిలోని ప్ర‌త్య‌క్ష సాక్షికి త‌ల్లి సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. చ‌ర్చికి బ్లాక్ డ్రెస్ లో వ‌చ్చిన ఆగంత‌కుడు విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపిన‌ట్లు చెబుతున్నారు. అమెరికా కాల‌మానం ప్ర‌కారం ఆదివారం ఉద‌యం 11.30 గంట‌ల వేళ‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇష్టారాజ్యంగా కాల్పులు జ‌రుపుతున్న వేళ‌.. ఆగంత‌కుడ్ని ఒక వ్య‌క్తి అడ్డుకోవ‌టంతో మ‌రికొంద‌రి ప్రాణాలు ద‌క్కాయ‌ని. లేకుంటే మ‌రింత ప్రాణ న‌ష్టం జ‌రిగేద‌ని చెబుతున్నారు. ఈ మార‌ణ‌హోమం అగ్ర‌రాజ్యంతో పాటు.. ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.