Begin typing your search above and press return to search.

మాల్యా.. అక్క‌డోళ్ల‌కు పే..ద్ద హీరో!

By:  Tupaki Desk   |   4 Dec 2017 9:22 AM GMT
మాల్యా.. అక్క‌డోళ్ల‌కు పే..ద్ద హీరో!
X
కోట్లాది భార‌తీయులు ఛీకొట్టే లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యాను అమితంగా అభిమానించి.. ఆరాధించే వారు ఉన్నారు. ఆ మాట‌కు వ‌స్తే ఒక ఊరే ఆయ‌న వెనుక ఉంది. ఆయ‌న్ను విప‌రీతంగా అభిమానించ‌ట‌మే కాదు.. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ భార‌త్ కు పంప‌కూడ‌ద‌ని కోరుకోవ‌టం క‌నిపిస్తుంది. ఈ చిత్ర‌మైన అంశానికి సంబంధించి పూర్తి వివ‌రాల్లోకి వెళితే..

దేశీయంగా ప‌లు బ్యాంకుల‌కు దాదాపు రూ.9వేల కోట్ల‌కు పైగా టోపీ పెట్టి.. ద‌ర్జాగా లండ‌న్‌కు పారిపోయిన విజ‌య్ మాల్యా ఉదంతం తెలిసిందే. భార‌త్ నుంచి పారిపోయిన మాల్యా యూకేకు పారిపోయారు. లండ‌న్‌ కు శివారు అయిన టెవిన్ గ్రామంలో ఆయ‌న ఉంటున్నారు. అక్క‌డి వారు మాల్యాను అమితంగా ఆరాధిస్తుంటారు.

దాదాపు ఏడాదికి పైనే టెవిన్ గ్రామంలో ఉంటున్న మాల్యాను భార‌త్‌ కు తిరిగి తెచ్చేందుకు భార‌త అధికారులు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకొని దేశానికి తీసుకొచ్చి.. ఆయ‌న చేసిన ఆర్థిక నేరాల‌కు శిక్ష‌లు వేయాల‌న్న డిమాండ్ ఉంది.

అయితే..యూకేలో ఉన్న మాల్యాను భార‌త్‌ కు పంపాల‌న్న అంశంపై ఈ రోజు కోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. మాల్యాను ఏదో విధంగా భార‌త్‌ కు తీసుకురావాల‌న్న ప‌ట్టుద‌ల‌తో మోడీ స‌ర్కారు ఉంది. ఇదిలా ఉంటే.. టెవిన్ గ్రామ ప్ర‌జ‌లు మాత్రం మాల్యాను ఎట్టి ప‌రిస్థితుల్లో భార‌త్‌ కు పంపొద్ద‌ని కోరుకోవ‌టం క‌నిపిస్తుంది.

సుమారు 2 వేల మంది ప్ర‌జ‌లు ఉండే టెవిన్ గ్రామ‌స్తుల‌కు మాల్యా గొప్ప‌ధ‌న‌వంతుడు. డ‌బ్బున్నోళ్ల‌కు ఏ రీతిలో అయితే క‌ష్టాలు ఉంటాయో అలాంటి క‌ష్టాలే మాల్యాకు ఉంటాయ‌న్న‌ది వారు భావిస్తుంటారు. అందుకే.. ఆయ‌న్ను భార‌త్‌కు పంప‌కూడ‌ద‌ని వారు కోరుకుంటారు. గ్రామ‌స్తుల మ‌న‌సుల్ని మాల్యా దోచుకోవ‌టానికి కార‌ణం లేక‌పోలేదు. ఈ మ‌ధ్య‌నే ఆయ‌న ల‌క్ష‌ల రూపాయిలు ఖ‌రీదు చేసే క్రిస్మ‌స్ చెట్టును గ్రామానికి విరాళంగా ఇచ్చారు. ఇలాంటి ప‌నుల‌తో అక్క‌డి స్థానికుల మ‌నసుల్ని దోచేసుకున్నారు మాల్యా. త‌మ గ్రామానికి మాల్యా పెద్ద ఆస్తి అని అక్క‌డి ప్ర‌జ‌లు చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉంటే మ‌రోవైపు మాల్యాను భార‌త్‌ కు ర‌ప్పించేందుకు ముమ్మ‌ర ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన కేసు విచార‌ణ లండ‌న్ లో ఈ రోజు ప్రారంభ‌మైంది. అనంత‌రం 5 - 6 - 7 - 11 - 12 - 13 - 14వ తేదీల్లో కొనసాగనుంది. వెస్ట్ మినిస్ట‌ర్ మేజిస్ట్రేట్ కోర్టులో జ‌రిగే ఈ విచార‌ణను చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బుత్ నోట్ స‌మీక్షించ‌నున్నారు. భార‌త స‌ర్కారు త‌ర‌ఫున బ్రిట‌న్స్ క్రౌన్ ప్రాసిక్యూష‌న్ స‌ర్వీస్ వాదిస్తోండ‌గా.. మాల్యా త‌ర‌పు అక్క‌డి ప్ర‌ముఖ లాయ‌ర్ వాదిస్తున్న‌ట్లు చెబుతున్నారు. మాల్యాను భార‌త్‌ కు అప్ప‌గిస్తే ఆయ‌న ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని.. జైల్లో క‌ల్పించే భ‌ద్ర‌త‌పై ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాదులు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో.. జైల్లో మాల్యాకు క‌ల్పించే భ‌ద్ర‌త‌ప‌రమైన చ‌ర్య‌ల్ని భార‌త్ త‌ర‌పు లాయ‌ర్లు కోర్టుకు చెప్ప‌నున్నారు.