Begin typing your search above and press return to search.

టెస్లా కార్లు వచ్చేస్తున్నాయి...ప్రారంభ ధర ఇదే!

By:  Tupaki Desk   |   13 July 2023 6:06 PM GMT
టెస్లా కార్లు వచ్చేస్తున్నాయి...ప్రారంభ ధర ఇదే!
X
గతకొంతకాలంగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ఎలక్ట్రానిక్‌ కార్ల దిగ్గజం టెస్లా ప్రయత్నాలు చేస్తుందంటూ కథనాలొస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆ కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌ ఈ మేరకు పలు సందర్భాల్లో పేర్కొన్నారు! ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఇండియాలో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందని తెలుస్తుంది.

అవును... ఇండియాలో తమ కార్ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు అవసరమైన పెట్టుబడి ప్రతిపాదనల కోసం భారత ప్రభుత్వంతో టెస్లా చర్చలు ప్రారంభించినట్లు కథనాలు వస్తున్నాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఏటా ఐదు లక్షల విద్యుత్తు వాహనాల ను ఉత్పత్తి చేసే సామర్థ్యం గల ప్లాంట్‌ ను ఏర్పాటు చేయాలని టెస్లా భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఫలితంగా... ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని దేశాలకు భారత్‌ లోని ప్లాంటులో ఉత్పత్తి చేసిన కార్లను ఎగుమతి చేయాలని ఆ కంపెనీ భావిస్తోందని అంటున్నారు. ఇదే సమయంలో ఈ విద్యుత్తు వాహనాల ప్రారంభ ధర రూ.20లక్షలుగా ఉండనున్నట్లు తెలుస్తోందని అంటున్నారు.

కాగా... గత నెల ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఆయనతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మస్క్‌ మాట్లాడుతూ.. భారత్‌ లో టెస్లా కార్యకలాపాలు వీలైనంత త్వరగా ప్రారంభమవుతాయని.. త్వరలోనే దీనిపై ప్రకటన ఉండే అవకాశముందని తెలిపారు.

సాధారణంగా విదేశాలనుంచి దిగుమతి చేసుకునే లగ్జరీ కార్ల విషయంలో భారత్ లో కాస్ట్‌ ఇన్సూరెన్స్‌ ఫ్రెయిట్‌ ఎక్కువగానే ఉంటుందని అంటుంటారు. ఇందులో భాగంగా 40,000 డాలర్లు (దాదాపు రూ. 33 లక్షలు) దాటిన కార్లపై 100 శాతం టాక్స్ వర్తిస్తోంది.

దీంతో భారత్ చేరే సరికి ఆ కార్ల ధర భారీగా పెరిగిపోతుంది. ఫలితంగా వీటి దిగుమతులపై పెద్దగా ఆసక్తి కనరబరచడం లేదని తెలుస్తుంది. అయితే పన్నులను తగ్గించాలని టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ అప్పట్లో భారత ప్రభుత్వాన్ని కోరారు. అయితే అందుకు ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు.

అనంతరం... భారత్‌ లోనే తయారీని చేపట్టడం వల్ల ఖర్చు చాలా తగ్గుతుందని.. అప్పుడు కార్లకు డిమాండ్‌ ఉంటుందని ఒక సలహా ఇచ్చిందని తెలుస్తుంది. కనీసం విడి భాగాలుగా తీసుకొచ్చి భారత్‌ లో అసెంబుల్‌ చేసే విధానం పైనైనా దృష్టి సారించాలని టెస్లాకు భారత ప్రభుత్వం గతంలో సూచించిందనీ తెలుస్తుంది. దీంతో ఈ దిశగా ఆలోచించిన మస్క్... ఈ మేరకు ఇండియాలోనే ప్లాంట్ ను స్థాపించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది!