Begin typing your search above and press return to search.

ఇండియాలోకి టెస్లా కారు.. జూన్లో రోడ్డుపైకి.. నెటిజన్ల కామెంట్లు!

By:  Tupaki Desk   |   17 Jan 2021 5:30 AM GMT
ఇండియాలోకి టెస్లా కారు.. జూన్లో రోడ్డుపైకి.. నెటిజన్ల కామెంట్లు!
X
ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ భారత్‌లోకి ప్రవేశిస్తోంది. మరో ఆరు మాసాల్లో టెస్లా కార్లు ఇండియన్ రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లనున్నాయి. ఈ కార్లకోసం మన దేశంలో చాలా మంది ఎదురు చూస్తున్నారు. వారి కోసం జనవరి నుంచే బుకింగ్ సదుపాయం కల్పించింది కంపెనీ. అయితే.. టెస్లా కారు ఇండియాలోకి వస్తోందన్న వార్తలపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇండియాలోకి టెస్లా కంపెనీ ప్రవేశంపై ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ రెండు రోజుల క్రితం ట్వీట్ చేశారు. టెస్లాను భారత్ లోకి తీసుకు వస్తున్నట్లు ఆయన ప్రకటించారు. టెస్లా రాకపై గత కొద్ది రోజులుగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా గత ఏడాది డిసెంబర్ లో ఈ విషయాన్ని ధృవీకరించారు.

ఈ నేపథ్యంలో.. టెస్లా కార్ల మేకింగ్ ప్లాంట్, ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటు కోసం పలు రాష్ట్రాలతో ఆ సంస్థ చర్చిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాగా.. బెంగళూరులోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC)లో టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో రూ.1లక్ష పెయిడప్ క్యాపిటల్‌తో అన్‌లిస్టెడ్ సంస్థగా ఓ కంపెనీ నమోదు చేసుకుంది. దీంతో భారత్ లోకి టెస్లా ఎంట్రీ ఖరారైందని తేలిపోగా.. తాజాగా మస్క్ ట్వీట్ ఆ విషయాన్ని అధికారికంగా ధృవీకరించినట్లైంది.

కాగా.. టెస్లా ఇంక్ కంపెనీ భారత్ లోకి ఎంట్రీ ఇస్తుండడంపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరులో పాలనపై విమర్శలు చేస్తున్నారు. ‘దారుణమైన రోడ్లు ఉన్న బెంగళూరు నగరంలోకి టెస్లా రాక’ అంటూ పలువురు ట్వీట్ చేస్తున్నారు. ‘టెస్లా, గూగుల్ సరికొత్త సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు తయారు చేయగా.. బెంగళూరు కార్పొరేషన్ మాత్రం ‘ఫ్లోటింగ్ కార్లు’ కనిపెట్టింది’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ కామెంట్ కు వరద నీటిలో కొట్టుకుపోతున్న కార్ల ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. మరో నెటిజన్ అయితే.. ‘టెస్లా ఇంక్ ఫ్లైయింగ్ మోడల్ కారు తెచ్చే వరకు బెంగళూరులో ఇబ్బంది తప్పదు’ అంటూ కామెంట్ చేశాడు. మన రోడ్ల దుస్థితికి అద్దంపట్టేలా ఉన్న ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

కామెంట్ల తీరు ఎలా ఉన్నా.. టెస్లా మోడల్-3 కార్లను జూన్ లో లాంచ్ చేయడం మాత్రం ఖరారైపోయింది. అయితే.. ఈ మోడల్ బుకింగ్ మాత్రం ఈ నెల నుండే ప్రారంభిస్తున్నారు. భారతీయులకు ఇప్పటి వరకు టెస్లా కార్లు అందుబాటులో లేవు. దీంతో ఈ మోడల్ ను వినియోగించాలని చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు.

ఈ మోడల్ కారు ధర రూ.55 లక్షల నుండి రూ.60 లక్షల వరకు ఉంది. కాగా.. మధ్యలో డీలర్ లేకుండా నేరుగా కస్టమర్ కే ఈ ఎలక్ట్రానిక్ వాహనాలను విక్రయిస్తోంది టెస్లా! ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 500 కిలో మీటర్లు ప్రయాణిస్తుందీ కారు. కేవలం 3.5 సెకన్లలో 0 నుండి 100 కిలో మీటర్ల వేగం అందుకునే కెపాసిటీ ఈ మోడల్-3 కారు సొంతం. అయితే.. 2016లోనే మోడల్-3 కార్ల బుకింగ్స్‌ను ప్రారంభించినప్పటికీ.. మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ వెహికిల్ పాలసీలు, దిగుమతి సుంకం వంటి కారణాలతో ఆలస్యమైంది.

కాగా.. టెస్లా ఇంక్ కంపెనీ దేశీ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటర్స్‌తో జత కలిసే అవకాశం ఉందంటూ గతంలో ఊహాగానాలు వచ్చాయి. కానీ.. ఈ వార్తలను టాటా మోటార్స్ ఖండించింది. టెస్లా తో తాము చేతులు కలపడం లేదని స్పష్టం చేసింది.