Begin typing your search above and press return to search.

మణిపూర్‌లో ఉగ్రదాడి.. కల్నల్ కుటుంబంతో సహా ఏడుమంది దుర్మరణం !

By:  Tupaki Desk   |   13 Nov 2021 5:30 PM GMT
మణిపూర్‌లో ఉగ్రదాడి.. కల్నల్ కుటుంబంతో సహా ఏడుమంది దుర్మరణం !
X
మణిపూర్‌ లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. సైన్యం కాన్వాయ్‌ పై జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో అసోం రైఫిల్స్‌కు చెందిన కమాండింగ్ ఆఫీసర్, ఆయన కుటుంబం సహా ఇతర సైనికులు చనిపోయారు. చురాచంద్‌పూర్ జిల్లా సింఘాట్ వద్ద ఈ దాడి జరిగింది. అసోం రైఫిల్స్‌కు చెందిన కాన్వాయ్‌పై 10 గంటల సమయంలో దాడి జరిగినట్టు అధికారులు తెలిపారు. కల్నల్ విప్లవ్ త్రిపాఠీ, ఆయన భార్య, కుమారుడు, మరో నలుగురు జవాన్లు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

దాడి వెనుక స్థానిక పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ దాడిని మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. సైనికులపై దాడికి పాల్పడిన కుట్రదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసులు, పారా మిలటరీ దళాలు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయని తెలిపారు. ఘటనకు పాల్పడినవారికి శిక్షించి బాధితులకు న్యాయం చేస్తామని వివరించారు.

సెహకన్ గ్రామం సమీపంలో అసోం రైఫిల్స్ కల్నల్ కాన్వాయ్‌పై భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు దాడిచేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కల్నల్ విప్లవ్ త్రిపాఠీ, ఆయన భార్య, కుమారుడు, క్విక్ రియాక్షన్ టీమ్ జవాన్లు ముగ్గురు ఘటనా స్థలిలోనే చనిపోయారు. మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో ప్రాణాలులొదిలారు. మాయన్మార్ సరిహద్దుల్లోని చురచందాపూర్ జిల్లాలో పౌర కార్యాచరణను పరిశీలించడానికి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఈ దాడికి తామే పాల్పడినట్టు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఈ దాడిని ఖండించారు.  ఉగ్రవాదుల జాడ కోసం రాష్ట్ర బలగాలు & పారా మిలటరీ ఇప్పటికే ఆపరేషన్ ప్రారంభించాయన్నారు.