Begin typing your search above and press return to search.

న్యూఇయ‌ర్ పార్టీపై ఉగ్ర‌దాడి...39 మంది మృతి

By:  Tupaki Desk   |   1 Jan 2017 9:46 AM GMT
న్యూఇయ‌ర్ పార్టీపై ఉగ్ర‌దాడి...39 మంది మృతి
X
మ‌రోమారు ఉగ్ర‌వాదులు త‌మ పంజా విప్పారు. కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల సంద‌ర్భంగా ట‌ర్కీలో రాక్ష‌స చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌టంలో 39 మంది మృత్యువాత ప‌డ్డారు. న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ సంద‌ర్భంగా పార్టీలో ఉన్న వారిని ఉగ్ర‌వాదులు విచ‌క్ష‌ణార‌హితంగా కాల్చి చంపుతుండ‌టంతో త‌మ‌ను తాము కాపాడుకునేందుకు ప‌క్క‌నే ఉన్న జ‌ల‌సంధిలోకి ప‌లువురు దూకారు.

ఇస్తాంబుల్‌లోని రీనా నైట్‌క్ల‌బ్‌లోకి సాంటా డ్రెస్సుల్లో వ‌చ్చిన ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు..విచ‌క్షణార‌హితంగా కాల్పులు జ‌ర‌ప‌డంతో 39 మంది మ‌ర‌ణించారు. 40 మంది గాయ‌ప‌డ్డారు. చ‌నిపోయిన వారిలో 16 మంది విదేశీయులు ఉన్నారు. ఈ కాల్పుల ఘ‌ట‌న‌తో భ‌యాందోళ‌న‌ల‌కు గురైన చాలా మంది ప‌క్క‌నే ఉన్న బోస్ఫోర‌స్ జ‌ల‌సంధిలోకి దూకారు. ప్ర‌స్తుతం వారిని ర‌క్షించ‌డానికి ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. కాల్పులకు పాల్ప‌డిన‌వాళ్లు అర‌బిక్ మాట్లాడిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు వెల్ల‌డించారు. కాల్పులు జ‌రిగిన స‌మ‌యంలో సుమారు 700 మంది అక్క‌డ జ‌రుగుతున్న కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల్లో సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాల్పుల‌తో బెదిరిపోయిన చాలా మంది వ్య‌క్తులు నైట్ క్ల‌బ్ నుంచి బ‌య‌ట‌కు ప‌రుగెత్త‌డం క‌నిపించింది.

ఇదిలాఉండ‌గా....ఈ మ‌ధ్య కాలంలో ఉగ్ర‌దాడుల‌తో ట‌ర్కీ అట్టుడికిపోయింది. కుర్దిష్ మిలిటెంట్లు, ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదులు నెత్తుటేర్లు పారించారు. డిసెంబ‌ర్ 10న ఇస్తాంబుల్లోనే ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ త‌ర్వాత జ‌రిగిన రెండు బాంబు దాడుల్లో 44 మంది మృతి చెందారు. ఓ పోలీస్ వ్యాన్ ల‌క్ష్యంగా కుర్దిస్థాన్ ఫ్రీడ‌మ్ ఫాల్క‌న్స్ ఈ దాడికి పాల్ప‌డింది. వారం రోజుల త‌ర్వాత జ‌రిగిన కారు బాంబు దాడిలో 14 మంది ట‌ర్కీ సైనికులు మృతి చెందారు. 2016 జూన్‌లో ఇస్తాంబుల్‌లోని అటాటుర్క్ ఎయిర్‌ పోర్ట్‌ లో జ‌రిగిన మూడు బాంబు దాడుల్లో 47 మంది మృత్యువాత ప‌డ్డారు. ఆగ‌స్ట్‌ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదులు జ‌రిపిన ఆత్మాహుతి దాడిలో 34 మంది పిల్ల‌లు స‌హా 57 మంది మ‌ర‌ణించారు. 2016లో ఇలా వ‌రుస దాడుల‌తో ట‌ర్కీ నెత్తురోడింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/