Begin typing your search above and press return to search.

70 మంది విద్యార్థుల తలల్లోకి బుల్లెట్లు!

By:  Tupaki Desk   |   20 Jan 2016 7:16 AM GMT
70 మంది విద్యార్థుల తలల్లోకి బుల్లెట్లు!
X
పాకిస్థాన్ లో మరో దారుణం చోటు చేసుకుంది. కొన్ని నెలల క్రితం తీవ్రవాదులు ఒక స్కూల్లోకి దూరి పెద్ద ఎత్తున చిన్నారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. వందలాది మంది తల్లుల గర్భశోకాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఆ చేదు అనుభవం నుంచి బయటకు రాకముందే మరో దారుణం చోటు చేసుకుంది. పాకిస్థాన్ వాయువ్య ప్రాంతంలోని చర్సడా నగరంలోని బచాఖాన్ విశ్వవిద్యాలయంపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు.

ముగ్గురు ఉగ్రవాదులు వర్సిటీ క్యాంపస్ లోకి ప్రవేశించి విద్యార్థులు.. ఉపాధ్యాయుల మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో దాదాపు 70 మంది విద్యార్థుల తలల్లోకి బుల్లెట్లు దింపి రక్త దాహం తీర్చుకున్నారు. ప్రస్తుతం వర్సిటీ క్యాంపస్ లో ఒక ఈవెంట్ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి 3వేల మంది విద్యార్థులు.. దాదాపు 600 మంది అతిధులు హాజరయ్యారు. ఇంత భారీగా జరుగుతున్న కార్యక్రమంపై టార్గెట్ చేసిన ముష్కరులు విద్యార్థుల వెంటబడి మరీ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

విద్యార్థుల తలల్ని టార్గెట్ చేసి మరీ కాల్పులు జరుపుతున్నట్లు చెబుతున్నారు. ముగ్గురు ఉగ్రవాదులు క్యాంపస్ లోకి చొరబడినట్లు చెబుతున్నా.. మొత్తం ఎంతమంది ఉగ్రవాదులు వర్సిటీ లోపలకు ప్రవేశించారన్నది ఇప్పుడు సందేహంగా మారింది. ప్రస్తుతం వర్సటీలో భీతావాహ పరిస్థితి నెలకొందని.. మృతదేహాలు ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయని.. 50 మంది విద్యార్థులు, ఒక ప్రొఫెసర్‌ చనిపోయినట్లు యూనివర్సిటి అధికారికంగా ప్రకటించింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.