Begin typing your search above and press return to search.

ఉగ్రవాదులకు.. షెల్టర్ గా తెలుగు రాష్ట్రాలు

By:  Tupaki Desk   |   8 Aug 2015 5:38 AM GMT
ఉగ్రవాదులకు.. షెల్టర్ గా తెలుగు రాష్ట్రాలు
X
ఉగ్రవాదులకు.. మాఫియాకు రెండు తెలుగు రాష్ట్రాలకు షెల్టర్ జోన్లుగా మారాయా?.. తాజా పరిణామాలు చూస్తే ఇది వాస్తవం అన్న రీతిలో సాగటం గమనార్హం. ఆ మధ్యన నల్గొండ జిల్లాలో సిమీ ఉగ్రవాదులు కాల్పులు జరపటం.. పోలీసులు దుర్మరణం పాలు కావటం తెలిసిందే.

ఈ ఉదంతం తర్వాత.. తెలంగాణ.. ఆంధ్రా ప్రాంతాల్లో ఉగ్రవాదుల జాడలు ఉన్నాయన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు.. వారం క్రితం గోదావరి జిల్లాలో ఒక భారీ మందుగండు డంప్ దొరకటం పలువురిని విస్మయానికి గురి చేసింది. అదంతా మావోల పనిగా భావించారు.

తాజాగా.. తెలుగు రాష్ట్రంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బీసీసీఐ సభ్యుడు రాజీవ్ శుక్లాను రూ.100కోట్లు ఇవ్వాలని.. లేకుంటే చంపేస్తామంటూ ఇద్దరు దుండగులు బెదిరించారు.

వారి గురించి ఆరా తీసిన పోలీసులు.. ఢిల్లీ నుంచి వెతుక్కుంటూ నేరుగా ఏపీలోని నెల్లూరుకు వచ్చి పట్టుకున్నారు. తీరా చూస్తే.. వారిద్దరూ మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులుగా భావిస్తున్నారు. వారిద్దరూ దావూద్ సభ్యులమని చెబుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరి.. ఇదెంత వరకూ నిజం అన్నది పోలీసుల విచారణలోకానీ తేలదు.

ఎక్కడో ఢిల్లీలో ఉన్న బీసీసీఐ సభ్యుడ్ని బెదిరించటం.. అది కూడా రూ.100కోట్లు డిమాండ్ చేయటం అంత చిన్నవిషయం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజా పరిణామాలు చూస్తుంటే.. రెండు తెలుగు రాష్ట్రల్లో నిఘా వ్యవస్థలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్న భావన కలగటం ఖాయం. ఎవరికి అనుమానం కలుగకుండా ఉండేందుకు.. రెండు తెలుగురాష్ట్రాల్లో ప్రశాంతంగా ఉంటాయన్న పేరున్న ప్రాంతాల్ని ఉగ్రవాదులు.. మాఫియా మూకలు షెల్టర్ జోన్ కింద వినియోగిస్తున్నాయా? అన్న కోణంలో నిఘా వర్గాలు ఆరా తీయాల్సి ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. లేదంటే.. మరింత ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఓ సీనియర్ పోలీసు అధికారి లోగుట్టుగా వ్యాఖ్యానించటం గమనార్హం.