Begin typing your search above and press return to search.

టెక్సాస్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకదానికొకటి 100 కార్లు ఢీ - 5 మంది మృతి!

By:  Tupaki Desk   |   12 Feb 2021 4:37 AM GMT
టెక్సాస్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకదానికొకటి 100 కార్లు ఢీ - 5 మంది మృతి!
X
అమెరికాలో టెక్సాస్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంచు తుపాన్ కారణంగా వాహనాల టైర్లు పట్టుకోలేపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు 100 వాహనాలు.. ఒకదానినొకటి ఢీకొని మైలున్నర మేర చిందరవందరగా పడిపోయాయి. దీంతో మైళ్ల కొద్దీ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా సుమారు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రమైన మంచు తుపానుతో రహదారిపై వాహనాల టైర్లు పట్టు కోల్పోయి ఈ ప్రమాదానికి దారితీసింది. అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం ఫోర్త్‌విత్‌ సమీపంలో 35వ అంతర్రాష్ట్రీయ రహదారిపై గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రమాద స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది ఒక్కో వాహనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ అందులోని వారిని బయటకు తీసి, అవసరమైన చికిత్స అందిస్తున్నారు. దెబ్బతిన్న వాహనాలను పక్కకు తరలిస్తున్నారు. చాలా వరకు వాహనాలు నుజ్జునుజ్జయి పోయాయి. జారుడుగా ఉన్న ఆ మార్గంలో రాకపోకలు సాగించేందుకు సహాయక సిబ్బంది సైతం ఇబ్బందులు పడుతున్నారు. క్షతగాత్రుల సంఖ్య పెరుగుతుందని యంత్రాంగం తెలిపింది. ఫెడ్‌ ఎక్స్‌ కు చెందిన ట్రక్కు ఒకటి అదుపుతప్పి బారియర్‌ ను ఢీకొని ఆగిపోయింది. వెనుకే వచ్చిన మరికొన్ని కార్లు ఆ ట్రక్కును ఢీకొని నిలిచిపోవడంతో ఈ ప్రమాదాల పరంపర మొదలైనట్లు భావిస్తున్నారు.

గాయపడ్డ వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రహదారిపై ప్రమాద దృశ్యాలు ఒళ్లుగగుర్పొడిచేలా ఉన్నాయి. రోడ్డు ప్రమాదంతో రహదారిపై పేర్చుకుపోయిన వాహనాలను పోలీసులు క్లియర్‌ చేశారు. టెక్సాస్‌ రాష్ట్రంలో షిర్లీ మంచు తుపాను కారణంగా∙జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు. తుపాను ప్రభావంతో కెంటకీ, వెస్ట్‌ వర్జీనియాల్లోని సుమారు 1.25 లక్షల నివాసాలు, వాణిజ్యప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.