Begin typing your search above and press return to search.

సూడాన్లో ఘోరం..60 మంది చిన్నారుల మృతి

By:  Tupaki Desk   |   2 Jun 2023 12:00 PM GMT
సూడాన్లో ఘోరం..60 మంది చిన్నారుల మృతి
X
సూడాన్లో అంతర్యుద్ధం ప్రభావంతో ఘోరాలు జరిగిపోతున్నాయి. దేశం పై ఆధిపత్యం కోసం సూడాన్ సైన్యానికి, పారామిలిటరి బలగాల మధ్య కొంతకాలంగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. వీళ్ళ మధ్య యుద్ధం సంగతేమో కానీ మధ్యలో సంబంధం లేని మామూలు జనాలు నలిగిపోతున్నారు. ఆధితప్యపోరాటం ఇప్పట్లో ముగిసేఛాయలు కనబడకపోవటంతో ఇప్పటికే లక్షలాదిమంది ఇతర దేశాల కు వలస వెళ్ళిపోయారు. కొన్ని వందలమంది చనిపోగా, వేలమంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చేరారు.

అయితే మరో ఘోరం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే రాజధాని ఖార్తూమ్ లోని అనాధశరణాలయంలో ఆరువారాల్లో 60 మంది శిశువులు, చిన్నారులు చనిపోయారట. రెండు రోజుల్లోనే 26 మంది చనిపోయారు. శిశువులు, చిన్నారులకు ఆకలైనపుడల్లా పాలు పట్టాల్సుంటుంది. అయితే అనాధశరణాలయంలో పిల్లల ను సంరక్షించేవాళ్ళల్లో చాలామంది పారిపోయారట. దాంతో పిల్లల కు పాలుపట్టే వాళ్ళు లేకపోవటంతో 60 మంది చనిపోయారు.

పిల్లల కు పాలుపట్టించాల్సిన వయసులో ఉత్తమంచినీళ్ళు మాత్రమే తాగిస్తున్నారు. దాంతో ఆకలికి తట్టుకోలేక పిల్లలు చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా చెప్పింది. ఎప్పుడైతే విషయం మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసిందో వెంటనే సూడాన్ ప్రభుత్వం పై ప్రపంచదేశాల్లో ఆగ్రహం మొదలైపోయింది.

దాంతో యునిసెఫ్, రెడ్ క్రాస్ దళాలు రంగంలోకి దిగాయి. మే 28వ తేదీన పిల్లల కు అవసరమైన పాలు, ఆహారం, మందులు తదితరాల ను తీసుకుని అనాదశరణాలయంలో క్యాంపు వేశాయి. వీలైనంత తొందరలో పిల్లలందరి నీ తీసుకుని రాజధాని నుండి దూరంగా తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అంతర్జాతీయ మీడియా లెక్కల ప్రకారం ఇప్పటివరకు సూడాన్లో 1.65 మిలియన్ల మంది జనాలు పొరుగుదేశాల్లోకి పారిపోయారు. సూడాన్ డాక్టర్స్ సిండికేట్ ప్రకటన ప్రకారం ఘర్షణల్లో ఎలాంటి సంబంధం లేని మామూలు జనాలు 900 మంది చనిపోయారు. అయితే వాస్తవ మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని అంచనావేస్తున్నారు.

దేశంలోని 13.6 మిలియన్ పిల్లల కు అత్యవసర మానవతా సాయం అవసరమని యునిసెఫ్ ప్రతినిదులు ప్రకటించారు. ఈ ప్రకటనల తోనే సూడాన్లో అంతర్యుద్ధం పరిస్ధితి ఎంతఘోరంగా ఉందో అర్ధమైపోతోంది. ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మరో వైపు సూడాన్లో అంతర్యుద్ధంతో జనాలు అల్లాడిపోతున్నారు.