Begin typing your search above and press return to search.

అమెరికా - చైనా మ‌ధ్య భ‌గ్గుమ‌న్న ఉద్రిక్త‌త‌లు.. కార‌ణ‌మిదే!

By:  Tupaki Desk   |   4 Sep 2022 12:30 PM GMT
అమెరికా - చైనా మ‌ధ్య భ‌గ్గుమ‌న్న ఉద్రిక్త‌త‌లు.. కార‌ణ‌మిదే!
X
తైవాన్‌పై యుద్ధానికి కాలు దువ్వుతున్న చైనా.. అగ్ర రాజ్యం అమెరికాపై నిప్పులు చెరిగింది. ప్ర‌స్తుతం చైనా- తైవాన్ మ‌ధ్య ప‌రిస్థితి నివురుగ‌ప్పిన నిప్పులా ఉంది. ఇలాంటి స్థితిలో తైవాన్‌కు మొద‌టి నుంచి త‌న అండ‌దండ‌లు అందిస్తున్న అమెరికా మ‌రోమారు భారీ సాయాన్ని ప్ర‌క‌టించింది. ఏకంగా రూ.8,768 కోట్ల విలువైన ఆయుధాల‌ను తైవాన్‌కు అందించ‌నుంది.

అమెరికా.. తైవాన్‌కు అందించే ఆయుధాల్లో నౌకల విధ్వంసక ఆయుధాలు, గగనతలం నుంచి గగనతలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించే క్షిపణులు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. త‌ద్వారా ద‌క్షిణ చైనా స‌ముద్రంలో త‌న‌దే ఆధిప‌త్యం కావాల‌ని.. తైవాన్‌ను త‌న అధీనంలోకి తెచ్చుకోవాలని ఆశిస్తున్న‌ చైనాకు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది.

కాగా ఇప్పటికే తైవాన్‌కు రూ.862 కోట్ల విలువైన‌ మిలట‌రీ-సాంకేతిక సాయాన్ని అందించ‌డానికి అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ ఏడాది (2022) ఇప్పటికే తైవాన్‌తో అమెరికా నాలుగుసార్లు ఆయుధాలు విక్ర‌యించే ఒప్పందాలు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలో అమెరికా.. తైవాన్‌కు ప్రకటించిన రూ.8,768 కోట్ల ఆయుధాలను విక్రయ ఒప్పందంపై చైనా తాజాగా స్పందించింది. ఇందుకు ప్రతి చర్యలు తీసుకుంటామని అమెరికాను హెచ్చరించింది. అమెరికా చర్యను తమ దేశం వ్యతిరేకిస్తోందని అమెరికాలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి లియు పెంగ్యు పేర్కొన్నారు. అమెరికా అన్ని హ‌ద్దులు దాటింద‌ని.. తైవాన్‌కు ఆయుధాలు అందించ‌డం ద్వారా త‌మ సౌర్వ‌భౌమ‌త్వాన్ని దెబ్బ‌తీసే చ‌ర్య‌ల‌కు దిగింద‌ని నిప్పులు చెరిగింది.

తైవాన్ కు ఆయుధాలు అమ్ముతూ చైనా అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తైవాన్‌కు ఆయుధాలు అమ్మ‌డం తమ సార్వభౌమత్వానికి, భద్రతాపర ప్రయోజనాలకు భంగం కలిగించడమేనని దుయ్య‌బ‌ట్టింది.

ద‌క్షిణ చైనా స‌ముద్రం మొత్తం త‌న‌దేన‌ని.. తీర ప్రాంత దేశాల‌పై క‌య్యానికి కాలు దువ్వుతోంది.. చైనా. ద‌క్షిణ చైనా స‌ముద్రంపై ఆధిప‌త్యం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోన్న చైనాకు అమెరికా చ‌ర్యలు తీవ్ర‌ ఆగ్ర‌హం క‌లిగిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తైవాన్‌ను స్వాధీనం చేసుకుని అమెరికాకు షాక్ ఇవ్వ‌డానికి యుద్ద ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనా చర్యలను అమెరికా నిశితంగా పరిశీలిస్తోంది. చైనా ముప్పు నుంచి తైవాన్‌ను త‌ప్పించడానికి వేల కోట్ల రూపాయ‌ల విలువైన ఆయుధాల‌ను అందిస్తోంది.