Begin typing your search above and press return to search.

ట్రాక్టర్ల ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు..రైతు మరణం - మృతదేహంతో అక్కడే బైఠాయించిన రైతులు

By:  Tupaki Desk   |   26 Jan 2021 12:00 PM GMT
ట్రాక్టర్ల ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు..రైతు మరణం - మృతదేహంతో అక్కడే బైఠాయించిన రైతులు
X
కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకోవాలంటూ గత కొన్ని రోజులుగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఆందోళనల్లో భాగంగా నేడు రైతులు ట్రాక్టర్ల తో ర్యాలీ నిర్వహించదలిచారు. ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా పరేడ్ జరుగుతున్న సమయంలో రైతులు ట్రాక్టర్ల ర్యాలీకి పూనుకోవడంతో ట్రాక్టర్ల ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఐటీవో జంక్షన్ వద్ద ఆందోళనలో పాల్గొన్న 46 ఏళ్ల ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన పోలీసులు, రైతుల మధ్య ఘర్షణకు దారితీసింది.

పోలీసుల బుల్లెట్ తగలడం వల్లే రైతు మరణించాడని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. రైతు మృతదేహంతో ఐటీవో జంక్షన్ వద్ద బైఠాయించారు. అయితే ట్రాక్టర్‌ పైనుంచి పడటం వల్ల ఆ రైతు మరణించాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అనుమతి లేని మార్గాల్లో ప్రవేశించిన రైతులను అడ్డుకోవడానికి ప్రయత్నించగా, రైతులు వారి ట్రాక్టర్లను తమ మీదకి ఉరికించారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ట్రాక్టర్‌పై ఉన్న ఓ రైతు ప్రమాదవశాత్తూ కిందపడ్డాడని చెప్పారు. తలకు బలమైన గాయం కావడంతో ఆ రైతు మరణించి ఉంటాడని తెలిపారు.

మరోవైపు పోలీసుల నిర్బంధాన్ని చేధించి ఎర్రకోటకు చేరుకున్న రైతులను అక్కడి నుంచి పంపించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను అక్కడ నుంచి తరిమేయడానికి ప్రయత్నిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రైతులు ఎర్రకోటను ముట్టడించారు. ఎర్రకోట బురుజుల పైకి చేరి జెండాలు ఎగరేశారు.అనేక ఉద్రిక్త పరిస్థితుల మధ్య హింసాత్మకంగా రైతుల ర్యాలీ మారింది.

రిపబ్లిక్ డే పరేడ్‌ కంటే ముందే ఉదయం ట్రాక్టర్ ర్యాలీ చేపట్టిన రైతులు పెద్ద సంఖ్యలో ఢిల్లీలోకి వివిధ ప్రాంతాల నుంచి భారీగా చేరుకున్నారు. వారిని నిరోధించేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో రైతులు బారికేడ్లు దాటే ప్రయత్నం చేశారు. దీంతో వారిని నిరోధించే క్రమంలో భాష్పవాయిగోళాలు, లాఠీలకు పోలీసులు పని చెప్పారు. ఇక నిరసనకారులు కూడా పోలీసులపై పలు చోట్ల దాడులకు తెగబడ్డారు.