వణికిస్తున్న కరోనా వైరస్ విస్తరణ అంతకంతకూ వ్యాప్తి చెందుతోంది. సామాన్యుడు.. సెలబ్రిటీ అన్న తేడా లేకుండా విస్తరించుకుంటూ వెళుతున్న వైరస్.. ఎవరిని విడిచి పెట్టటం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు తెలంగాణలో ఇప్పటివరకూ ఎప్పుడూ.. ఎక్కడా లేని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కర్నూలు ఎంపీ సోదరుల ఫ్యామిలీలో ఆరుగురికి పాజిటివ్ గా తేలితే.. తాజాగా ఏపీ రాజభవన్ లో నాలుగు కేసులు నమోదు కావటం కొత్త కలకలానికి తెర తీసింది.
గవర్నర్ హరించదన్ కు చీఫ్ సెక్యురిటీ అధికారిగా వ్యవహరించే వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా చెబుతున్నారు. రాజ్ భవన్ లో పని చేసే ఒక అటెండర్ తోపాటు.. మరో స్టాఫ్ నర్సుకు కూడా పాజిటివ్ గా తేలినట్లు తెలుస్తోంది. ఆదివారం ఏపీలో 81 కేసులు కొత్తగా నమోదయ్యాయి. విజయనగరం జిల్లా తప్పించి మిగిలిన అన్ని జిల్లాల్లోనూ వైరస్ వ్యాప్తి సాగింది. ప్రస్తుతానికి ఏపీలో 1097 కేసులు నమోదు కావటం తెలిసిందే.
రాజ్ భవన్ లోని ఉద్యోగులకు కరోనా పాజిటివ్ గా తేలటంపై విస్మయం వ్యక్తమవుతోంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు.. ముందస్తుజాగ్రత్తలు తీసుకునే రాజ్ భవన్ లోనూ ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావటంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాజ్ భవన్ ఉద్యోగులకు సోకిన కరోనాకు మూలం ఎక్కడన్న విషయంపైన అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ లింకును ఛేదించే పనిలో వారు నిమగ్నమై ఉన్నారు.