Begin typing your search above and press return to search.

అరుస్తూ.. ఏడుస్తూ.. దొర్లుతూ.. ఆ స్కూల్ పిల్ల‌ల‌కేమైంది?

By:  Tupaki Desk   |   29 July 2022 12:46 PM GMT
అరుస్తూ.. ఏడుస్తూ.. దొర్లుతూ.. ఆ స్కూల్ పిల్ల‌ల‌కేమైంది?
X
ఉత్త‌రాఖండ్ జిల్లాలో ఒక వింత ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఉన్న‌ట్టుండి విద్యార్థులు పెద్ద‌గా అరుస్తూ.. ఏడుస్తూ.. త‌ల‌లు బాదుకుంటూ క‌నిపించారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలో బాగేశ్వ‌ర్ జిల్లాలోని రైఖిలి గ్రామంలో జ‌రిగింది. మాస్ హిస్టీరియాలా విద్యార్థులు ఇలా ఏడుస్తూ.. అరుస్తూ.. త‌ల‌లు బాదుకోవ‌డంతో ఉపాధ్యాయుల‌తో స‌హా అంద‌రూ ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

చాలా మంది విద్యార్థులు.. అందులోనూ ముఖ్యంగా ఎక్కువ మంది బాలికలు, కేకలు వేయడం, నేలపై దొర్లడం, హిస్టీరియాతో అసాధారణంగా ప్రవర్తించార‌ని మీడియా క‌థ‌నాలు తెలుపుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై జూనియర్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు విమ్లా దేవి మాట్లాడుతూ.. కొంతమంది బాలికలు, ఒక విద్యార్థి అసాధార‌ణంగా క‌నిపించార‌ని మీడియాకు తెలిపారు.

విద్యార్థులు ఏడ‌వ‌డం, అరుస్తుండ‌టం, వ‌ణుకుతుండ‌టం, ఎటువంటి కారణం లేకుండా తలలు కొట్టుకోవ‌డం వంటి చేశార‌ని చెప్పారు. దీంతో తాము సంబంధిత విద్యార్థుల‌ తల్లిదండ్రులను పిలిచామ‌న్నారు. దీంతో వారు స్థానిక పూజారిని తీసుకొచ్చార‌న్నారు. అలాగే వైద్య అధికారుల బృందం స్కూల్ కు వ‌చ్చి విద్యార్థుల‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించార‌ని చెప్పారు. దీంతో ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింద‌న్నారు.

పాఠశాల క్యాంపస్‌లో తాము పూజలు నిర్వహించాలని తల్లిదండ్రులు పట్టుబట్టార‌ని పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయురాలు తెలిపారు. విద్యార్థినులు వింతగా ప్రవర్తించడమేమిటనే విషయంపై స్పష్టత లేద‌న్నారు. అయితే ఇది 'మాస్ హిస్టీరియా' కేసుగా కనిపిస్తోందని వైద్యులు భావిస్తున్నారు.

మాస్ హిస్టీరియా అనేది అసాధారణమైన ప్రవర్తనలు, ఆలోచనలు, భావాల వ‌ల్ల వ‌స్తుంద‌ని అంటున్నారు. మాస్ హిస్టీరియా అనేది ఒక రకమైన కన్వర్షన్ డిజార్డర్ లేదా మానసిక అనారోగ్య‌ స్థితి అని నిపుణులు చెబుతున్నారు.

కాగా ఇదే స్కూల్లో మూడేళ్ల క్రితం కూడా ఇలా జరిగిందంట. అంతేకాకుండా అల్మోరా, పితోరాఘర్. చమోలి వంటి పొరుగు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మాస్ హిస్టీరియా సంఘటనలు గతంలో జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.