Begin typing your search above and press return to search.

అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ ను ఆగమాగం చేసిన సోషల్ పోస్టు

By:  Tupaki Desk   |   6 March 2023 7:29 PM GMT
అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ ను ఆగమాగం చేసిన సోషల్ పోస్టు
X
స్వీయ క్రమశిక్షణ.. విచక్షణ అన్నది లేకుండా మనసుకు తోచింది పోస్టుల రూపంలో సోషల్ మీడియాలో పోస్టు చేసే ధోరణి ఈ మధ్యన ఎక్కువైంది. ఏపీలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ శత్రుత్వం వ్యక్తిగత స్థాయికి వెళ్లటం.. తాము అభిమానించే వారిని ఆకాశానికి ఎత్తేయటం.. తాము వ్యతిరేకించే వారిని ఇష్టారాజ్యంగా మాట్లాడే ధోరణి ఈ మధ్యన ఎక్కువైంది. ఈ తరహా పోస్టులను సోషల్ మీడియాలో చూసినప్పుడు జగుప్సకు గురి చేస్తున్న పరిస్థితి.

తాజాగా ఇలాంటి తీరునే ప్రదర్శించిన ఒక అతిగాడి కారణంగా అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవటమే కాదు.. వైసీపీ.. టీడీపీ వర్గాల మధ్య రాళ్లదాడికి కారణమైంది. తీవ్ర ఉద్రికత్తలకు దారి తీసింది. ఈ మొత్తానికి కారణమైన వ్యక్తి బాగానే ఉన్నా.. ఈ విషయంలో స్పందించిన వారికి.. రక్షణగా నిలిచిన పోలీసులకు గాయాలైన పరిస్థితి. అసలేమైందంటే..

నందిగామకు చెందిన హరిక్రిష్ణారెడ్డి సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతుంటాడు. వైసీపీ వీరభక్తుడైన అతను.. టీడీపీ అన్నా.. ఆ పార్టీ నేతలన్నా అస్సలు ఇష్టపడరు. వారిపై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసేస్తుంటారు. ఇందులో భాగంగా తాజాగా టీడీపీ నేతలు నారా లోకేశ్, పరిటాల శ్రీరామ్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టుతో వీడియోలు పెట్టాడు. అక్కడితో ఆగని అతను రాప్తాడు నియోజకవర్గ కేంద్రానికి వచ్చి వారిపై మళ్లీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తీవ్ర ఆరోపణలు చేశారు.

అనంతరం తాను అనంతపురం క్లాక్ టవర్ వద్దకు వస్తున్నట్లుగా సవాలు విసిరాడు. ఇది చూసిన టీడీపీ కార్యకర్తలు అనంతపురంలోని క్లాక్ టవర్ వద్దకు వచ్చారు. దీంతో ఈ వివరాల్ని తెలుసుకున్న పోలీసులు.. ఈ వ్యవహారానికి కారణమైన వైసీపీ అభిమాని హరిక్రిష్ణారెడ్డిని వదిలేసి.. టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. ఇక.. క్లాక్ టవర్ వద్దకు వచ్చిన హరిక్రిష్ణ లోకేశ్ ను, పరిటాల సునీతను.. పరిటాల శ్రీరామ్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు. దీంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన టీడీపీ నేతలు మండిపడ్డారు. దీంతో.. ఇరుపార్టీలకు చెందిన వారి మధ్య రాళ్లదాడి మొదలైంది. దీంతో.. పలువురు గాయపడ్డారు. ఇదంతా చూసినప్పుడు.. తన అతితో శాంతిభద్రతల సమస్యకు కారణమైన హరిక్రిష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. అందుకు భిన్నంగా వ్యవహరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.