Begin typing your search above and press return to search.

ఫిరాయింపు ఎంపీల్లో నెక్స్ట్ ఎవరు ?

By:  Tupaki Desk   |   3 Jan 2022 1:30 AM GMT
ఫిరాయింపు ఎంపీల్లో నెక్స్ట్ ఎవరు ?
X
సీబీఐ దెబ్బకు ఫిరాయింపు ఎంపీల్లో టెన్షన్ పెరిగిపోతోంది. సంవత్సరం చివరి రోజున వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు మీద సీబీఐ చార్జిషీటు ఫైల్ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ తరపున గెలిచినా రఘురామ బీజేపీతోనే అంటకాగుతున్నారు. ఇందుకు రెండు కారణాలున్నాయి. మొదటిదేమో జగన్మోహన్ రెడ్డితో పడకపోవటం. రెండో కారణం ఏమిటంటే ఆయన పై ఉన్న ఆర్ధిక ఆరోపణలు. రు. 947 కోట్ల ప్రజాధనాన్ని బ్యాంకుల ద్వారా దోచుకున్నట్లు స్వయంగా బ్యాంకుల కన్సార్షియమే ఫిర్యాదు చేసింది.

కన్సార్షియం ఫిర్యాదుపై రంగంలోకి దిగిన సీబీఐ బ్యాంకులను మోసం చేయటం నిజమే అని తేల్చింది. ఈ విషయంలో అరెస్టు ఒకటే మిగిలిందనే సమయంలో ఎంపీ వైసీపీని వదిలిపెట్టి బీజేపీతో రాసుకుపూసుకుని తిరుగుతున్నారు. దీంతో బీజేపీ ఆశీస్సులున్న కారణంగా ఎంపీకి ఏమీ కాదనే ప్రచారం బాగా పెరిగిపోయింది. ఆయన వ్యవహారశైలి కూడా అందుకు దోహడపడింది. అయితే ఎవరు ఊహించని విధంగా ఏడాది చివరి రోజున ఎంపీతో పాటు మరో 16 మందిపై ఢిల్లీ సీబీఐ కోర్టులో సీబీఐ చార్జిషీటు ఫైల్ చేయటం సంచలనంగా మారింది.

నరేంద్రమోడి, అమిత్ షా తో క్లోజ్ గా ఉన్నట్లు ఎంపీ ఎంత కలరింగ్ ఇచ్చుకున్నా సీబీఐ అదేమీ పట్టించుకోలేదు. సరిగ్గా ఇక్కడే టీడీపీలో నుండి బీజేపీలోకి ఫిరాయించిన కొందరు ఎంపీల్లో టెన్షన్ మొదలైందట. సుజనా చౌదరి, సీఎం రమేష్ పైన కూడా దాదాపు ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి. వీళ్ళు టీడీపీలో ఉన్నపుడు సీబీఐ, ఐటి, ఈడీ ఉన్నతాధికారులు ఇళ్ళు, ఆఫీసులపైన చాలాసార్లు దాడులు చేశారు. విచారణకు పిలిపించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోగానే బీజేపీలోకి ఫిరాయించారు.

అప్పటినుండి వాళ్ళ జోలికి దర్యాప్తు సంస్ధలేవీ వెళ్ళలేదు. అయితే తాజాగా రఘురామపై సీబీఐ చార్జిషీటు ఫైల్ అయినపుడు మరి వీళ్ళను మాత్రం సీబీఐ వదులుతుందా వాదన మొదలైంది. ఎందుకంటే వీళ్ళందరిపైనా ఇప్పటికే దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేసి విచారణ కూడా పూర్తి చేసేశాయి. చార్జిషీట్లు వేయటమే మిగులుంది. ఇపుడు రఘురామపైన ఛార్జిషీటు ఫైల్ అయింది కాబట్టి నెక్ట్స్ ఎవరు ? అనేదే క్వశ్చన్.