Begin typing your search above and press return to search.

ఆ పది శాతం పిల్ల‌లు బ‌డికి రార‌ట ! ఏపీలో వింత

By:  Tupaki Desk   |   9 Aug 2022 1:30 AM GMT
ఆ పది శాతం పిల్ల‌లు బ‌డికి రార‌ట ! ఏపీలో వింత
X
ఏపీ ప్ర‌భుత్వానికి ముఖ్యంగా త‌ల్లిదండ్రుల‌కు ఇదొక దిగ్బ్రాంతిక‌ర వార్త. బ‌డి బ‌య‌ట పిల్ల‌లు త‌గ్గించాల‌ని, డ్రాపౌట్లు కుదించాల‌ని, ఇంకా చెప్పాలంటే లేకుండా చేయాల‌ని త‌ల‌పోస్తున్న ప్ర‌భుత్వానికి పిల్ల‌ల హాజ‌రు శాతం అంతంత మాత్రమే అన్న‌వార్త నిజంగానే ఓ క‌ల‌వ‌ర‌పాటు.

అమ్మ ఒడి కార్య‌క్ర‌మంలో భాగంగా డ్రాపౌట్ల‌ను త‌గ్గించేందుకు, అదేవిధంగా హాజ‌రు శాతం పెంచేందుకు ఓ వైపు ప్ర‌భుత్వం కృషి చేస్తుండ‌గా, అందుకు విరుద్ధంగా క్షేత్ర స్థాయి ఫ‌లితాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లలో విద్యార్థుల గైర్హాజ‌రు శాతం రోజూ ప‌దిహేను నుంచి పందొమ్మిది శాతం ఉంటుండ‌గా, ప్ర‌యివేటు బ‌డుల‌లో  గైర్హాజ‌రు  శాతం ఎనిమిది నుంచి ప‌దిశాతం ఉంది అని ప్ర‌ధాన మీడియా చెబుతోంది.

ముఖ్యంగా ఎయిడెడ్ పాఠ‌శాల‌లో విద్యార్థుల సంఖ్య ల‌క్ష దాటి ఉంది. కానీ బ‌డుల‌కు హాజరవుతున్న విద్యార్థులు మాత్రం ఎన‌భై నాలుగు వేల మంది మాత్రంగానే ఉన్నారు. అదేవిధంగా వివిధ మేనెజ్మెంట్ ల ప‌రిధిలో  (జెడ్పీ, మండ‌ల ప‌రిష‌త్ పాఠ‌శాల‌లు క‌లిపి) 29 ల‌క్ష‌ల మందికి పైగా విద్యార్థులుండ‌గా, హాజ‌ర‌వుతున్న విద్యార్థుల సంఖ్య మాత్రం 23 ల‌క్ష‌ల 70 వేల 855 గా ఉంది.

అదేవిధంగా ప్ర‌యివేటు బడుల‌కు సంబంధించి 24 ల‌క్ష‌ల మందికి పైగా విద్యార్థులుండ‌గా, హాజ‌రు సంఖ్య 21 ల‌క్ష‌లకు పైగా ఉంది. ఏ విధంగా చూసుకున్నా అన్ని బ‌డులకు సంబంధించి ( ప్ర‌భుత్వ, ప్ర‌యివేటు బ‌డుల‌కు సంబంధించి) 63 ల‌క్ష‌ల మందికి పైగా విద్యార్థులు ఉండ‌గా, 53 ల‌క్ష‌ల మందికి పైగా విద్యార్థులు మాత్ర‌మే హాజ‌ర‌వుతున్నారు ప్ర‌తిరోజూ !

మ‌రోవైపు అమ్మ ఒడి మాత్రం 75 శాతం హాజ‌రు శాతం ఉంటేనే వ‌ర్తింపు చేస్తామ‌ని స‌ర్కారు చెబుతోంది. త‌ప్ప‌ని స‌రిగా హాజ‌రు శాతం నిర్దేశించిన విధంగా లేక‌పోతే ప‌థ‌కం వ‌ర్తింప‌జేయ‌డం సాధ్యం కాద‌ని చెబుతోంది. కానీ విద్యార్థుల త‌ల్లిదండ్రులు మాత్రం వీటిని పెద్ద‌గా ప‌ట్టించుకుంటున్న దాఖ‌లాలు లేక‌పోగా, ప‌థ‌కం వ‌ర్తించ‌క‌పోతే  ఉపాధ్యాయ వ‌ర్గాల‌పై తిరుగుబాటు చేస్తున్న దాఖ‌లాలు కూడా ఉన్నాయ‌ని వివిధ మాధ్య‌మాల ద్వారా వార్త‌లు అందుతున్నాయి.

ఏ విధంగా చూసుకున్నా ప‌ది శాతం పిల్లలు  బ‌డి కి డుమ్మా కొడుతున్నారు అని ప్ర‌ధాన మీడియా చెబుతోంది. అయితే వీరిని బ‌డికి ర‌ప్పించే బాధ్య‌త ఉపాధ్యాయుల‌కు ఉంది. వీరు ఎస్ఎంఎస్ -ల ద్వారా కొన్నిసార్లు వివ‌రం అందించినప్ప‌టికీ ఫ‌లితం లేదు. కొన్ని సార్లు ఉపాధ్యాయుల నిర్ల‌క్ష్యం కూడా ఉంద‌ని ప్ర‌ధాన మీడియా ద్వారా తెలుస్తోంది.  ఇవ‌న్నీ క‌లిసి బ‌డికి పిల్ల‌లు గైర్హాజ‌ర‌వుతున్నారు అని తేలింది.