ఇరుగుపొరుగుతో హ్యాపీగా ఉండేవారు తక్కువే. ఏదో ఒక గొడవ వారి మధ్యన ఉంటుంది. ఊళ్లు మొదలుకొని నగరాల వరకూ ఈ పంచాయితీ కనిపిస్తూనే ఉంటుంది. అయితే.. ఇది హద్దులు దాటనంత వరకూ ఓకే. కానీ.. అందుకు భిన్నంగా తమ పొరుగింట్లో ఉన్న వారితో జరిగిన గొడవకు ఒళ్లు మండిన ఒక మహిళ తీవ్ర ఆగ్రహంతో దారుణానికి పాల్పడింది.
ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో జరిగిన ఘోరం ఏకంగా పది మంది సజీవ దహనమయ్యారు. మరో 30 మంది గాయపడ్డారు. పారిస్ లోని ప్రిన్సెస్ సాకర్ స్టేడియంకు సమీపంలో సంపన్నులు నివసించే ప్రదేశంగా రూ ఎర్లాంజర్ ప్రాంతానికి పేరు. అక్కడి ఎనిమిది అంతస్తుల భవనంలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత (స్థానిక కాలమానం ప్రకారం) ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.
పెద్ద ఎత్తున మంటలతో పాటు.. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. దీంతో.. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి.మంచి నిద్రలో ఉన్న సమయంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పలువురు ఇళ్లల్లో నుంచి బయటకు రాలేకపోయారు.
అగ్ని ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక శాఖ స్పందించినప్పటికీ.. మంటల్ని వెంటనే అదుపులోకి తేలేకపోయారు. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటల నుంచి తప్పించుకోవటానికి భవనంలోని వారు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో చిక్కుకుపోయిన పది మంది సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. వీరిలో ఒక చిన్నారి ఉన్నట్లు చెబుతున్నారు. మంటల్ని అదుపులోకి తీసుకురావటం కోసం దాదాపు 250 మంది అగ్నిమాపక సిబ్బంది గంటల పాటు శ్రమించారు.
అగ్నిప్రమాదం ఎందుకు సంభవించిందంటూ పోలీసులు జరిపిన విచారణలో షాకింగ్ అంశం ఒకటి బయటకు వచ్చింది. ఇరుగుపొరుగు మధ్య నెలకొన్న గొడవతో ఆగ్రహం చెందిన మహిళ ఒకరు అపార్ట్ మెంట్ ను తగలబెట్టారని.. మంటలకు ఇదే కారణంగా భావిస్తున్నారు.ఈ ఘోరానికి కారణమైన 40 ఏళ్ల మహిళను అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఆమెకు మానసిక సమస్యలు ఉండేవని చెబుతున్నారు.