Begin typing your search above and press return to search.

పది రోజులు .. నాలుగు తీర్పులు ..సుప్రీం కోర్ట్ ఏంచెప్పబోతుంది ?

By:  Tupaki Desk   |   2 Nov 2019 10:58 AM GMT
పది రోజులు .. నాలుగు తీర్పులు ..సుప్రీం కోర్ట్ ఏంచెప్పబోతుంది ?
X
వచ్చే పదిరోజుల సమయంలో దేశ ప్రగతినే సమూలంగా మార్చే కీలక తీర్పులను సుప్రీంకోర్టు వెల్లడించనుంది. నవంబరు 4 నుంచి పది రోజుల్లోపు అయోధ్య సహా పలు కీలక కేసుల్లో తీర్పులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ వెలువరించనున్నారు. దీనితో అందరిలోనూ ఉత్కంఠత ఎక్కువై పోతుంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా పరిష్కారం లేని సమస్యగా ఎన్నో వివాదాలకు కారణమైన అయోధ్య లో రామమందిరం నిర్మాణం పై సుప్రీం ఏంచెప్పబోతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కేసులో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘ రోజువారీ విచారణ ఇటీవలే పూర్తి చేసి తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

అయోధ్యలో 1934 నాటి అల్లర్లు సందర్భంగా బాబ్రీ మసీదుపై దాడిజరిగింది. ఈ సందర్భంగా మసీదు పాక్షికంగా దెబ్బతినగా, నాటి బ్రిటిష్ ప్రభుత్వం అయోధ్యలోని హిందువుల నుంచి జరిమానా వసూలు చేసి ఆ సొమ్ముతో దానిని పునరుద్దరించింది. అయితే, 1950 తర్వాత మళ్లీ ఈ వివాదం తెరపైకి వచ్చింది. 1950 డిసెంబరు 22-23 తేదీల్లో రాముడి విగ్రహాలను మసీదు మధ్యలో ఉంచి హిందువులు ప్రార్థనలు నిర్వహించారు. బాబ్రీ మసీదులో రాముడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించుకునే హక్కు కల్పించాలని కోరుతూ 1950లో గోపాల్ సింగ్ విశారద్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తర్వాత నిర్మోహీ అఖారా, సున్నీ వక్ఫ్ బోర్డులు కూడా వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. ఏడు దశాబ్దాలుగా సాగుతోన్న కోర్టు కేసు.. సుప్రీం తీర్పుతో కొలిక్కి వస్తుందని అందరూ భావిస్తున్నారు.

ఇక దేశం మొత్తం ఎదురుచూస్తున్నా అతి పెద్ద సమస్య శబరిమలై ఆలయ ప్రవేశం. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ గతేడాది ఫిబ్రవరి 6న ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది. దీనిపై కూడా విచారణ పూర్తిచేసిన త్రిసభ్య ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కీలక కేసులో తీర్పును వచ్చే వారం కోర్టు వెల్లడించనుంది.

అలాగే రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు, సీబీఐ డైరెక్టర్ల మధ్య వివాదంపై కూడా తీర్పు వెల్లడికానుంది. అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 45 ఏళ్ల లోపు మహిళలకు ప్రవేశం నిషేధం. దీనిపై మహిళ హక్కుల కార్యకర్తలు దాఖలుచేసిన పిటిషన్లను విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. 4-1తో వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే, ధర్మాసనంలోని మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హొత్రా మాత్రం మిగతా సభ్యుల తీర్పుతో ఏకీభవించలేదు. 10 నుంచి 45 ఏళ్లలోపు మహిళలను శబరిమలలోకి అనుమతించడం అంటే మత సంప్రదాయాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవడమేనని ఆమె అభిప్రాయపడ్డారు. దీన్ని మహిళా వివక్షగా చూడరాదని తెలిపారు.